ఎన్నాళ్లో వేచిన ఉదయం.. మెగా ఫ్యాన్స్‌కి ఈరోజే ఎదురైంది. బోయపాటి సినిమా ఫస్ట్ లుక్ రూపంలో. ఈ సినిమా టైటిల్ ఏమిటన్నది ఎప్పుడో తేలిపోయినా… ఫస్ట్ లుక్‌లో చరణ్ ఎలా ఉంటాడా?? అని ఆసక్తిగా ఎదురుచూశారు. తన సినిమాల్లో హీరోని ఓ కొత్త లుక్‌లో చూపించడం బోయపాటికి అలవాటు. ఈసారి చరణ్ ఇంకాస్త కొత్తగా కనిపిస్తాడని ఆశించారు. కానీ… తీరా చూస్తే… `వినయ విధేయ రామ`ఫస్ట్ లుక్ రెగ్యులర్‌గానే దర్శనమిచ్చింది. అసలు ఆ టైటిల్‌కీ, పోస్టర్‌కీ సంబంధమే లేదని, ఇది పూర్తిగా బోయపాటి పాత సినిమాల స్టైల్ లోనే ఉందన్నది మెగా అభిమానుల కామెంట్. నిజానికి ముందు అనుకున్న ఫస్ట్ లుక్ ఇది కాదు. దీపావళి పండక్కి సరిపోయేలా, టైటిల్‌కి న్యాయం జరిగేలా.. చాలా సంప్రదాయబద్ధంగా, పద్ధతిగా ఉన్న ఫస్ట్ లుక్‌ని డిజైన్ చేశారు. దానికి చరణ్ కూడా ఓకే అనేశాడు. చివరి నిమిషంలో ఫస్ట్ లుక్ మారిపోయింది. క్లాస్ లుక్ ని పక్కన పెట్టి, అప్పటికప్పుడు మాస్ లుక్‌ని వదిలారు. ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక ఉన్న సింగిల్ హ్యాండ్.. బోయపాటి శ్రీనుదే. `వినయ విధేయ రామ` పేరుకు తగ్గట్టు ఓ ట్రెడీషనల్ లుక్ బయటకు వస్తుందన్న ఉప్పు మీడియాకు ముందే అందేసింది. అభిమానులూ దానికి పిక్సయిపోయారు. అయితే… వాళ్లందరి ఆలోచనలకు భిన్నంగా లుక్ ని అందిస్తే కిక్ వస్తుందని బోయపాటి అప్పటికప్పుడు డిజైన్ చేయించిన లుక్ ఇది. అయితే… సీన్ రివర్స్ అయ్యింది. ఏదో ఆశిస్తే.. ఇంకేదో వచ్చిందని మెగా ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. పైగా చరణ్ ఫేస్‌ని పూర్తిగా చూపించకుండా.. మధ్యలో ఆయుధాన్ని అడ్డుగా పెట్టారు. చరణ్ లుక్‌లోనూ కొత్తదనం ఏమీ లేదు. అయితే ఫస్ట్ లుక్ కోసం డిజైన్ చేయించి, చివర్లో దాచేసిన ఆ లుక్‌ని త్వరలోనే విడుదల చేసి, మెగా ఫ్యాన్స్‌ని కాస్త ఊరడించాలని బోయపాటి భావిస్తున్నాడట. మరి అదెప్పుడు బయటపెడతాడో చూడాలి.