ఎన్టీఆర్ బయోపిక్ ముగిసిన వెంటనే బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కాల్సింది. అన్నీ ఓకే అనుకున్న తరుణంలో.. అనూహ్యంగా వాయిదా పడింది. బోయపాటి స్థానంలో కె.ఎస్.రవికుమార్ రావడం, ఆఘమేఘాలమీద ఆ సినిమాకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. కె.ఎస్.రవికుమార్ సినిమా పూర్తయ్యేంత వరకూ బోయపాటి సినిమాకి ఛాన్స్ లేదు. సెప్టెంబరు నుంచి ఈ సినిమా పట్టాలెక్కుతుంది.
ఈలోగా బోయపాటి ఓ సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. అందుకు అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇదివరకెప్పుడో అఖిల్ కోసం బోయపాటి ఓ స్క్రిప్టు రెడీ చేశాడు. డైలాగ్ వెర్షన్తో సహా బౌండెడ్ స్క్రిప్టు చేతిలో పెట్టుకున్నాడు బోయపాటి. అయితే… ఆ సినిమా పట్టాలెక్కలేదు. దాన్ని ఇప్పుడు లైన్లో కి తీసుకొచ్చే వీలు దక్కింది. ఇందుకు సంబంధించి అఖిల్ – బోయపాటి మధ్య మళ్లీ చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. వినయ విధేయ రామా ఫ్లాప్ అయినా సరే – బోయపాటికి 15 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా ముందుకొచ్చారు. అయితే… బోయపాటి మాత్రం అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. బాలయ్య కోసం స్క్రిప్టు తయారు చేసే పనిలో ఉన్నానని – కాస్త ఆలస్యమైనా ఆ సినిమానే పట్టాలెక్కిస్తానని, ఈలోగా మరో సినిమాపై దృష్టి పెట్టలేనని తేల్చి చెప్పేశాడట. అంటే.. బోయపాటి ఎదురుచూపులన్నీ బాలయ్య కోసమే అన్నమాట. అదీ ఒకందుకు మంచిదే. బాలయ్య – బోయపాటి కాంబో అంటే అంచనాలు ఓ రేంజులో ఉంటాయి. వాటిని అందుకోవాలంటే… మరింత కష్టపడాల్సిందే. బోయపాటి అదే చేస్తున్నాడిప్పుడు.