సాధారణంగా రామ్ చరణ్ సినిమాల విషయంలో కలగచేసుకోవడం చిరంజీవి అలవాటు. `చిరుత` నుంచి…`గోవిందుడు అందరివాడేలే` వరకూ అన్ని విషయాల్లోనూ చిరు జోక్యం తప్పని సరి. `ధృవ` రీమేక్ కాబట్టి పెద్దగా కలగజేసుకోలేదు. `రంగస్థలం` అంతా సుకుమార్ మీదే వదిలేశాడు. అది మంచి ఫలితం ఇచ్చింది కూడా. ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమా విషయంలోనూ అదే ఫాలో అవుతున్నాడు చిరు. చరణ్ – బోయపాటి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ కథని ముందు చరణ్‌కి వినిపించిన బోయపాటి.. ఆ తరవాతే చిరుకి చెప్పాడు. కథంతా విని… బోయపాటి పై నమ్మకంతో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు. అయితే.. `యాక్షన్ పాళ్లు మరీ మితిమీరకుండా చూసుకో..` అని ఒకే ఒక్క సలహా ఇచ్చాడట. అయితే ఆ ఒక్క సలహాని కూడా బోయపాటి పక్కన పెట్టేశాడిప్పుడు. ఈ సినిమాలో యాక్షన్ మోతాదు ఎక్కువే. ఆ మటకొస్తే.. ఇప్పటి వరకూ బోయపాటి శ్రీను సినిమాల్లో కెల్లా హై ఓల్టేజీ యాక్షన్ సీన్లు ఇందులోనే ఉండబోతున్నాయట. ఆ లెక్కన చిరు ఇచ్చిన ఆ ఒక్క సలహాని కూడా బోయపాటి వినలేదన్నమాట. `రంగస్థలం` పూర్తిగా చరణ్ జడ్జిమెంట్‌పై నడిచిన సినిమా. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టయిపోయింది. అదే నమ్మకంతో.. బోయపాటి శ్రీను సినిమా విషయంలోనూ చిరు ఏమాత్రం కలగజేసుకోవడం లేదు. పైగా బోయపాటి చెప్పినా వినిపించుకునే రకం కాదు. దానికి తోడు `సైరా`లో చిరు ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ. అది తన సినిమాకాబట్టి… అనుక్షణం ఆ సినిమా ఆలోచనల్లోనే ఉండిపోతున్నాడట చిరు. అందుకే బోయపాటికి ఇంకాస్త స్వేచ్ఛ దొరికినట్టైంది.