బోయపాటి శ్రీనుకి పొలిటికల్ డ్రామాలు బాగా కలిసొచ్చాయి. లెజెండ్, సరైనోడు.. ఇవి రెండూ ఓరకంగా పొలిటికల్ డ్రామాలే. ఇప్పుడు రామ్ తో ఓ సినిమా చేస్తున్నాడు బోయపాటి శ్రీను. ఇది కూడా పూర్తి స్థాయిలో రాజకీయ నేపథ్యాల్లో సాగే కథ అని తెలుస్తోంది. రామ్ కి ఈ తరహా సినిమా చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుత సమకాలీన రాజకీయాలు, జనం తరచూ మాట్లాడుకొనే రకరకాల రాజకీయ వ్యవహారాలు, సంఘటనలు…. ఇవన్నీ ఈ సినిమాలో కనిపించబోతున్నాయట. ఈ సినిమాలో పొలిటికల్ పంచ్‌లు ఓ రేంజ్లో ఉండబోతున్నాయని టాక్. దాంతో పాటుగా ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఓ ప్రత్యేకమైన పాత్రలో నందమూరి బాలకృష్ణ కనిపించనున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనిపై బోయపాటి శ్రీను ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. బాలీవుడ్ ఐటెమ్ సోయగం ఊర్వశి రౌటాలా ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. బోయపాటి సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తుంటాడు. ఈ సినిమాలోనూ యాక్షన్ సీక్వెన్స్‌లు భారీగా ఉన్నాయి. ఇటీవలే.. ఓ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు. రామ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. బడ్జెట్ దాదాపుగా వంద కోట్లకు పైమాటే అని టాక్.