సరైనోడు తరవాత.. పెద్ద హీరోలతో సినిమా చేసే ఛాన్స్ ఉన్నా – ఇచ్చిన మాట కోసం బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేశాడు బోయపాటి శీను. అదే ‘జయ జానకి నాయక’ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ఫలితం బోయపాటికి చాలా ముఖ్యం. ఎందుకంటే – తన చేతిలో స్టార్ హీరో లేడు. అయినా సరే హిట్టు కొడితే బోయపాటి ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది. ఇది వరకు సినిమాలు స్టార్ల కోసం ఆడలేదు.. బోయపాటి కోసమే ఆడాయన్న మెసేజ్ వెళ్తుంది. సినిమా తేడా కొడితే.. ఆ ఎఫెక్ట్ కూడా బోయపాటిపై అంతే దారుణంగా ఉంటుంది. చిరంజీవి, బాలకృష్ణ, మహేష్‌బాబు… ఇలా బోయపాటి చేతిలో చాలా ఆప్షన్లు ఉన్నాయి. జయ జానకి నాయక తేడా కొడితే… అన్ని ఆప్షన్లు ఉండకపోవొచ్చు. అందుకే.. ఈసినిమా రిజల్ట్ ఏంటన్న టెన్షన్ కూడా బోయపాటిలో కనిపిస్తోంది.
పబ్లిసిటీ పరంగా ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఇవ్వాలో.. అంతా ఇచ్చేశాడు. డబ్బులు కూడా భారీగా ఖర్చు పెట్టారు. సాయి శ్రీనివాస్‌లాంటి హీరోతో రూ.35 కోట్ల బడ్జెట్‌తో ఓ సినిమా చేయడం మామూలు విషయం కాదు. పైగా ”11న వద్దు.. దానికంటే రోజు ముందు గానీ – వారం ఆలస్యంగా గానీ వద్దాం” అని నిర్మాత చెబుతున్నా.. పట్టుబట్టి మరీ 11నే విడుదల చేయిస్తున్నాడు బోయపాటి. అందుకే.. ఆ రూపంలోనూ ఒత్తిడంతా బోయపాటిపైనే ఉండబోతోంది. బోయపాటి దర్శకుడా? స్టార్ మేకరా? అనే సంగతి తేల్చే సినిమా ఇది. చూడాలి మరి… బోయపాటి ఏ మేరకు మెప్పించగలడో?