‘లెజెండ్’ సక్సెస్ మీట్ ని అంత తేలిగ్గా మర్చిపోలేరు. ‘నేను దేవిశ్రీ ని పిండేశా.. పడుకోనివ్వలేదు’ అంటూ వేదికపై బోయపాటి శ్రీను వీర లెవిల్లో స్పీచ్ ఇస్తే – అంతే ఘాటుగా, దీటుగా దేవిశ్రీ కూడా స్పందించాడు. ‘పిండుకోవడానికి నేనేమైనా మేకనా, గేదెనా?’ అంటూ రివర్స్ పంచ్‌లు వేశాడు. దేవిశ్రీ స్పీచ్ అప్పట్లో టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ తరవాత….బోయపాటి – దేవిశ్రీ మళ్లీ కలసి పనిచేయరేమో అనుకొన్నారంతా. కానీ ‘జయ జానకి నాయక’ కోసం మళ్లీ జట్టుకట్టారు. ఇప్పుడు ఒకర్ని మరొకరు పొగుడుకునే పనిలో ఉన్నారు.
అసలు ఆ స్పీచ్ తరవాత.. మళ్లీ కలసి ఎలా పనిచేశారు?? అని దేవిని అడిగితే ”ఆ సంగతి మేం అప్పుడే మర్చిపోయాం. ఆ రోజున కూడా ఇద్దరం గొడవ పడలేదు. ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు.. నా ఫీలింగ్ నేను చెప్పా. అప్పటి కప్పుడు స్పాంటేనిస్గా వచ్చేసిన మాటలవి. రెండ్రోజులకు అనుకొంటా.. ఇద్దరం మళ్లీకలసి.. లంచ్ చేశాం. బోయపాటి ప్రతిభావంతమైన దర్శకుడు. మా ఇద్దరి కాంబినేషన్లో ఇది నాలుగో సినిమా. మూడు సినిమూలూ బాగా ఆడాయి. ‘సరైనోడు’కీ నేనే పనిచేయాల్సింది. కానీ బిజీ షెడ్యూల్ వల్ల కుదర్లేదు” అని చెప్పుకొచ్చాడు దేవిశ్రీ.