అవును.. చిరంజీవి – బోయపాటి శ్రీనుల మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా చిరుకి ఓ కథ వినిపించాడు బోయపాటి. అయితే ఇది చిరు కోసం కాదు. రామ్ చరణ్ కోసం. రామ్ చరణ్ – బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ స్క్రిప్టు పైనే మనసు లగ్నం చేశాడు బోయపాటి శ్రీను. ఇప్పుడు అది పూర్తి రూపు సంతరించుకొంది. ఇటీవల చిరుని కలసుకొన్న బోయపాటి చిరుకి ఫైనల్ నేరేషన్ చెప్పి ఆయన్నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకొన్నాడు. ఇక నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేయడమే ఆలస్యం. బోయపాటిది ఊర మాస్ స్టైల్. ఈసారీ అలాంటి కథనే ఎంచుకొన్నారని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం చరణ్ మళ్లీ కండలు పెంచడం మొదలెట్టబోతున్నాడట. ధృవలో చాలా ఫిట్‌గా కనిపించిన చరణ్, రంగస్థలం కోసం కాస్త బొద్దుగా, పల్లెటూరి కుర్రాడిగా మారాడు. బోయపాటి మాత్రం.. ‘నా సినిమా కోసం ఫిట్‌గా తయారవ్వాలి.. కండలు బాగా పెంచాలి’ అని ముందే చెప్పేశాడట. రంగస్థలం షూటింగ్ పూర్తవ్వగానే.. చరణ్ తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెడతాడు. డిసెంబరు నెలాఖరున ఈ సినిమా లాంఛనంగా మొదలై, జనవరి చివరి వారం నుంచీ షూటింగ్ మొదలుపెట్టుకోనున్నదని సమాచారం.