మాస్ నాడీ భలేగా పట్టేశాడు బోయపాటి శ్రీను. కథల్లో వైవిధ్యం మాటేమో గానీ – ప్రేక్షకుడ్ని కథలో కనెక్ట్ చేయించే విధంగా సినిమాలు తీస్తుంటాడు. బోయపాటి సినిమా అంటే యాక్షన్, ఎమోషన్, భావోద్వేగాలు ఉండాల్సిందే. అయితే ఈసారి దానికి లవ్ స్టోరీ మిక్స్ చేసి తీసిన సినిమా `జయ జానకి నాయక`. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బోయపాటి శ్రీనుతో చేసిన చిట్ చాట్ ఇది
* ఈ వారం బాక్సాఫీసు దగ్గర పోటీ బలంగా ఉన్నట్టుంది?
– పోటీ అనేం కాదు. ప్రేక్షకులకు ఎన్ని సినిమాలు వచ్చినా చూడ్డానికి సిద్ధంగా ఉంటారు. ఒకేసారి మూడు సినిమాలు రావడం వల్ల వాళ్లకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే.. ఓ వంద థియేటర్లు తగ్గుతాయేమో అంతే. సోలోగా వస్తే 800 థియేటర్లలో పడాల్సిన బొమ్మ.. ఇప్పుడు 700 థియేటర్లలో పడుతుంది. అంతే తేడా.
* ఓ రోజు ముందే విడుదల అవుతుందని అనుకొన్నారంతా..
– మేం సినిమాని ఎప్పుడో సిద్ధం చేసేశాం. రిలీజ్ డేట్ కూడా 11నే అనుకొన్నాం. మార్చే ఉద్దేశం లేదు.
* ఈసారి ప్రేమకథ ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణాలేమైనా ఉన్నాయా?
– `భద్ర` ఓ ప్రేమకథ. దాని తరవాత మళ్లీ లవ్ స్టోరీ చేయాలనుకొనేవాడ్ని. కానీ మాస్, కమర్షియల్ సినిమాల్లో పడిపోవడం వల్ల కుదర్లేదు. కానీ కథ ఎప్పుడో నాలుగైదేళ్ల క్రితమే సిద్ధమైపోయింది. ఇప్పటికి కుదిరిందంతే.
* మధ్యలో మార్పులేమైనా చేశారా?
– అప్పుడు అనుకొన్న కథే. కాకపోతే సెకండాఫ్ మార్చా. నా శైలిలో ఎమోషన్, యాక్షన్ సన్నివేశాల్ని జోడించా.
* మీ సినిమా అంటే అది కచ్చితంగా ఉండాల్సిందేనా?
– నా సినిమాల్లో ఎప్పుడూ యాక్షన్, ఎమోషన్ ప్రత్యేకంగా ఉండవు. కథలో భాగంగానే వస్తాయి. ప్రేక్షకుడు కొట్టాలి అనుకొన్నప్పుడే అక్కడ ఫైట్ పెట్టాలి. లేదంటే యాక్షన్ ఎపిసోడ్‌కి అర్థం ఉండదు. నా నుంచి సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లోనూ, బయ్యర్లలోనూ కొన్ని అంచనాలుంటాయి. వాళ్లని నిరుత్సాహపరిచేలా ఎప్పుడూ సినిమా చేయను.. చేయలేను.
* సరైనోడు తరవాత పెద్ద పెద్ద స్టార్స్ మీతో సినిమా చేయడానికి సిద్ధపడ్డారు. కానీ మీరు మాత్రం బెల్లంకొండతో సినిమా చేశారు. ప్రత్యేకమైన కారణాలేమైనా ఉన్నాయా?
– ఇచ్చిన మాట కోసమే. మన బ్లడ్ ఓ కలర్ ఉంటుంది. నా మాటకో విలువ ఉంటుంది. తనతో చేస్తానని మాటిచ్చా. ఆ మాటకు విలువ ఇస్తూ సినిమా చేశా.
* ప్యాడింగ్ చూస్తే అదిరిపోయింది.. ఇదంతా బెల్లంకొండ కోసమేనా?
– మూడు కుటుంబాల మధ్య జరిగే కథ ఇది. ప్రతీ పాత్ర కీలకమే. అందుకే సీనియర్ నటుల్ని తీసుకొచ్చాం. అంతేతప్ప బెల్లంకొండ కోసం కాదు. సినిమా చూస్తే.. ఏ పాత్రని ఎందుకు తీసుకొచ్చామో మీకే తెలుస్తుంది.
* లెజెండ్ సమయంలో దేవిశ్రీ ప్రసాద్‌తో ఇష్యూ నడిచింది. మళ్లీ బాగానే కలిసిపోయారు..
– ఇద్దరు టెక్నీషియన్ల మధ్య అలాంటివి రావడం సర్వసాధారణం. ఆ సంగతి మేం అప్పుడే మర్చిపోయాం. దేవిశ్రీ ప్రసాద్‌తో ఇది నా నాలుగో సినిమా. మా జర్నీ ఎప్పుడూ బాగా ఉంటుంది. ఈ కథతో తాను బాగా కనెక్ట్ అయిపోయాడు. కథ విషయంలతో క్లారిటీ ఉంటే అందరి పని సులభం అవుతుంది.
* తదుపరి కూడా లవ్ స్టోరీలు ట్రై చేస్తారా?
– ఈ టైమ్‌లో ఇలాంటి సినిమాలే చేయాలని ఎప్పుడూ అనుకోను. ఆ క్షణంలో ఏమనిపిస్తే అదే చేస్తా.
* ఈసినిమాతో బెల్లంకొండ పెద్ద స్టార్ అయిపోతాడని అందరూ అంటున్నారు..
– అయిపోతే మంచిదే కదా? ఆ లక్షణాలు తనలో చాలా ఉన్నాయి. తన గత సినిమాలకూ ఈసినిమాలకూ పోలిక ఉండదు. ప్రేక్షకులు సాయి పాత్రని చాలా ప్రేమిస్తారు.
* తదుపరి సినిమా ఎప్పుడు ఎవరితో?
– మహేష్ బాబు, బాలకృష్ణ, చిరంజీవి, అఖిల్ కోసం కథలు రెడీ చేసిపెట్టా. బాలయ్యతో ఓ సినిమా మొదలవుతుంది. మే – జూన్‌లో ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఈలోగా ఓ సినిమా చేస్తానా, లేదా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.