నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. మే 28న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఈసినిమాలో బోయపాటి ఎంచుకున్న యునిక్ ఐడియా… బాలయ్యని అఘోరాగా చూపించడం. ఆ ఆలోచనకు బాలయ్య ముందు ఎగ్జైట్ అయ్యాడు కూడా. ఆ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ జరిగిపోయింది. కానీ బాలయ్య ఆలోచనలో మార్పు రావడం, ఆ ఆఅఘోరా ఎపిసోడ్ ని పక్కన పెట్టి, కొత్త సీన్లు రాసుకోవడం, వాటికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి కావడం.. జరిగిపోయాయి.
అయితే.. ఇప్పుడు ఈ అఘోరా ఎపిసోడ్ ఏం చేద్దాం? అనే ఆలోచనలో ఉన్నాడట బోయపాటి. ఈ ఎపిసోడ్ ని భారీ ఖర్చుతో తెరకెక్కించారు. దాదాపు ఆరు నిమిషాల పాటు సాగే ఎపిసోడ్ ఇది. దాన్ని పూర్తిగా తీసేయడానికి బోయపాటికి ఇష్టం లేదు. ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడూ బాలయ్య ఆ పాత్రలో కనిపించడు. ఆ పాత్ర కోసం టీమ్ పడిన కష్టం కూడా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే ఆ ఎపిసోడ్ ని.. సినిమా అయిపోయిన తరవాత.. ఎండ్ టైటిల్స్ పడుతున్నప్పుడు చూపిద్దామని భావిస్తున్నాడట. ఓ రకంగా ఇది కొత్త ఆలోచన. కానీ బాలయ్య అనుమతి కావాలి. అఘోరా గెటప్తోనూ, ఆ సెటప్ తోనూ ఏమాత్రం సంతృప్తిగా లేకపోవడంతోనే ఆ ఎపిసోడ్ పక్కన పెట్టి, రీ షూట్ చేశారు. అలాంటప్పుడు బాలయ్య అనుమతి ఇస్తాడా? లేదా? అనేది ఆసక్తికరం. బాలయ్యని ఒప్పిస్తే మాత్రం ఆ ఎపిసోడ్ ని అభిమానులు చూసేయొచ్చు.