భారత సైనికుల్ని అత్యంత ఘోరంగా హత్య చేసిన ఘటన ప్రజల మనసులపై తీవ్ర ప్రభావం చూపింది. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ చైనా ఉద్యమం ఊపందుకుంది. చైనా వస్తువులు అమ్మబోమని వ్యాపారస్తులు.. కొనబోమని ప్రజలు సోషల్ మీడియాలో ప్రతిజ్ఞలు చేస్తున్నారు. అయితే.. ఇదంతా.. సోషల్ మీడియా తృప్తే కానీ.. అసలు ఎమోషన్ కనిపించాల్సిన చోట కనిపించడం లేదని తాజాగా వెల్లడయింది. వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు… షియోమి ల్యాప్ ట్యాప్‌లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పోటీ పడ్డారు. ఎంతగా అంటే.. ఆన్ లైన్ ఫ్లాట్‌ఫాంలో అమ్మకానికి పెట్టిన క్షణాల్లోనే వాటికి నో స్టాక్ బోర్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి.
చైనాకు చెందిన వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ల కంపెనీ.. ఎయిట్ సిరీస్ మోడల్‌ను రిలీజ్ చేసింది. ఫైవ్ జీ ఫోన్ ఇది. దీంతో.. వినియోగదారులు కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. ఐఫోన్‌తో పోటీ పడి.. ధర ఉననప్పటికీ వెనక్కి తగ్గలేదు. మొదటి సేల్.. రెండో సేల్‌లోనూ.. క్షణాల్లో ఫోన్లన్నీ బుక్కయిపోయాయి. మూడు రోజుల నుంచి జరుగుతున్న బాయ్ కాట్ చైనా క్యాంపెయిన్ .. తమ అమ్మకాలపై ప్రభావం చూపుతుందేమోనని… ఆ కంపెనీ ఆందోళన చెందింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రభావం భయాలేమీ పెట్టుకోవద్దని..భారత వినియోగదారులు భరోసా ఇచ్చారు.
చీప్ సెల్ ఫోన్లతో భారత మార్కెట్లలో గట్టి పట్టు సంపాదించిన షియోమీ… కరోనా ను క్యాష్ చేసుకునేందుకు.. ఆన్ లైన్ క్లాస్‌ల మార్కెట్‌ను పట్టేందుకు ల్యాప్‌ట్యాప్‌లను విడుదల చేసింది. వీటిని కూడా.. వెర్రెత్తినట్లుగా కొనేస్తున్నారు… వినియోగదారులు. బాయ్ కాట్ చైనా క్యాంపెయిన్ ప్రభావం.. ఈ కంపెనీ అమ్మకాలపై కూడా ప్రభావం చూపలేదు. చైనా వస్తువులను భారతీయులు..వదిలి పెట్టలేనంతగా అలవాటు పడిపోయినట్లుగా పరిస్థితి మారిపోయిందని.. ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఏదో ఘటన జరిగినప్పుడు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేయడం తప్ప.. ప్రజలు చైనా వస్తువుల్ని వదిలి పెట్టలేని పరిస్థితి ఏర్పడింది.