వైసీపీ సోషల్ మీడియా తొందరపాటుకు జగన్ రెడ్డికి వంద కోట్లకు పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ బిగ్ ఎక్స్ పోజ్ పేరుతో హడావుడి చేయాలనుకుంది. మేమేమైనా తక్కువ అని వైసీపీ బిగ్ రివీల్ పేరుతో ఓ పోస్టర్ పెట్టింది. అది ఏమిటంటే బీఆర్ నాయుడు కుమారుడు డ్రగ్స్ అనుమానిత కేసులో ఉండటం. నిజానికి ఈ విషయాన్ని ఒక రోజు ముందుగానే సాక్షి పత్రిక ప్రకటించింది. కానీ నేరుగా పేరు రాస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి… ఓ చానల్ యజమాని అని రాసుకొచ్చింది.
సాక్షి పత్రిక చెప్పిన దాన్నే బిగ్ రివీల్ అంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రకటించింది. అదేదో గొప్ప డిస్కవరీ అన్నట్లుగా ప్రకటించారు. నేరుగా బీఆర్ నాయుడు పేరు పెట్టి ఈయనకా టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వబోతోందని కాస్త గీతదాటి రాసుకొచ్చారు. సాయంత్రానికి రియాక్షన్ వచ్చింది. టీవీ5 మూర్తి తెరపైకి వచ్చారు. వంద కోట్లకు పరువు నష్టం పిటిషన్ దాఖలు చేయబోతున్నామని ప్రకటించారు. నిజానికి సాక్షి సోషల్ మీడియా ప్రకటించిన పత్రంలో బీఆర్ నాయుడు పేరు లేదు. ఆయన కుమారుడి పేరు ఉంది.
అందులో ఆయన డ్రగ్స్ కొన్నాడని కానీ అమ్మాడని కానీ ఇంకా చెప్పాలంటే కనీసం వినియోగించాడని కానీ లేదు. డ్రగ్స్ వాడే అనుమానితులతో ఆయన టచ్లో ఉన్నారని ఉంది. ఆ నోట్ విశ్వసనీయత ఎంతో కూడా తెలియదు. అయినా బురత చల్లేశారు. ఇప్పుడు పరువు నష్టం కేసును ఎదుర్కోవాల్సి వస్తోంది.