ఏమాటకామాటే చెప్పుకోవాలి… ఇటీవల కామెడీ కింగ్ బ్రహ్మానందం నటించిన సినిమాలను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఒకటి ఆరా సినిమాలు తప్పిస్తే.. గడిచిన యేడాది కాలంలో ఆయన నటించిన చిత్రాల సంఖ్య పెద్దగా లేదు. బ్రహ్మానందాన్ని దర్శకులు పక్కన పెట్టేశారా? లేదంటే కావాలని బ్రహ్మి సినిమాలు తగ్గించారా? అని ప్రేక్షకుల్లో పలు సందేహాలు. వీటికి బ్రహ్మానందం మాటల్లో సమాధానం చెప్పాలంటే.. “నాకు ఆనందాన్ని ఇస్తున్న పాత్రలు మాత్రమే చేస్తున్నా. ఇబ్బంది పెట్టేవి వస్తే పక్కన పెట్టేస్తున్నా. ఇటీవల నేను సినిమాలు తగ్గించిన మాట వాస్తవమే” అన్నారు. తాను మాత్రమే అన్ని సినిమాలు చేసేయాలని అనుకోవడం లేదనీ, తన తరవాత వచ్చేవాళ్ళనీ చేయనివ్వాలని అనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. బ్రహ్మానందం బుల్లితెర మీద న్యాయనిర్ణేతగా వ్యవహరించే నవ్వుల కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలవుతోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాలు ఎందుకు తగ్గించేశాననే విషయమై ఆయన మాట్లాడారు.
లివ్ అండ్ లెట్ లివ్… తన సిద్ధాంతమని బ్రహ్మానందం పేర్కొన్నారు. తన తరవాత వచ్చేవాళ్ళకు అవకాశాలు రావాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఇంకా మాట్లాడుతూ “ఎన్నో సినిమాల్లో ఎనెన్నో పాత్రలు పోషించా. ప్రేక్షకుల్ని నవ్వించా. ఇంకా సినిమాలను పట్టుకుని వేలాడుతూ… మిగతావాళ్లు ఏమైపోయినా పర్వాలేదు. నేను మాత్రమే డబ్బులు సంపాదించుకోవాలని అనుకోవడం లేదు. నాకు మాత్రమే పేరు ప్రఖ్యాతలు వస్తే చాలని భావించడం లేదు. అందరికి పేరు రావాలి” అన్నారు.