దశాబ్దాల ప్రయాణం, సుదీర్ఘ అనుభవం… బ్రహ్మానందం సొంతం. అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ రికార్డుల్లో తన పేరు లిఖించుకొన్నారు. పద్మశ్రీ అందుకొన్నారు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చవి చూశారు. ఇప్పుడు ఆ అనుభవాల్ని ఆత్మ కథ రూపంలో పొందుపరిచారు. ‘నేను మీ బ్రహ్మానందమ్’ పేరుతో బ్రహ్మానందం తన స్వీయ చరిత్ర లిఖించుకొన్నారు. ఈ పుస్తకం విడుదలకు రెడీ అయ్యింది. త్వరలోనే హైదరాబాద్లో బుక్ ఎగ్జిబిషన్ జరగబోతోంది. ఈ సందర్భంగా ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొస్తారు.
ఆత్మకథ అనగానే జీవిత విశేషాలతో పాటు కాంట్రవర్సీలు కూడా గుర్తొస్తాయి. నిజాలు నిర్భయంగా చెప్పాల్సిన వేదిక కాబట్టి.. రచయితలు దాన్ని ఉపయోగించుకొంటారు కూడా. ఇది వరకు ఎన్నో ఆత్మకథలు వివాదాలకు దారి తీశాయి. కొన్ని పుస్తకాలైతే, ఫస్ట్ ఎడిషన్ తరవాత ప్రింటింగ్ కూడా ఆపేశారు. మరి బ్రహ్మానందం ఆత్మకథలో అలాంటి వివాదాలు ఉండబోతున్నాయా? ఉంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే ఆసక్తి నెలకొనడం సహజం.
బ్రహ్మానందం వివాదాలకు అతీతుడేం కాదు. ఆయనపై కూడా చాలా రూమర్లు వచ్చాయి. తోటి హాస్య నటుల్ని ఎదగకుండా చేశాడని, వాళ్లని తొక్కేశాడని, పారితోషికం పేరుతో ఇబ్బంది పెట్టాడని, హీరోయిన్లతో అనుచితంగా ప్రవర్తించాడని ఇలా రకరకాల రూమర్లు. మరి వీటిపై బ్రహ్మానందం నోరు విప్పుతాడా? సమాధానం చెబుతాడా? అనేది ఆసక్తి కలిగిస్తోంది.
అయితే బ్రహ్మానందం ఈ పుస్తకాన్ని వివాదాలకు, విమర్శకుల దూరంగా ఉంచడానికే చూశారని సమాచారం. ఆత్మకథలో ఏం చెప్పాలో, ఏం దాచాలో రచయితకు తెలియాలి. ఆ సమతూకం బ్రహ్మానందం పాటించాడని సన్నిహితులు చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే పుస్తకం బయటకు రావాలి.