హైదరాబాద్: టాలీవుడ్ నంబర్ వన్ కమెడియన్ బ్రహ్మానందం కెరీర్‌కు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడినట్లేనా అన్న వాదన ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ‘బ్రూస్లీ’, ‘షేర్’ చిత్రాలలో ఆయన పాత్ర ఎలాంటి కామెడీని పండించకపోవటంతో ఈ వాదన తెరపైకి వచ్చింది. ఇదే నిజమైతే మూడు దశాబ్దాల బ్రహ్మానందం కెరీర్ ముగిసినట్లవుతుంది.
బ్రహ్మానందం సూపర్ హిట్ సినిమాల విజయంలో కీలకపాత్ర పోషించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’, ‘కృష్ణ’, ‘అదుర్స్’, ‘రేసు గుర్రం’ వంటి చిత్రాలు వాటికి ఉదాహరణలు. అయితే ఇటీవలి కాలంలో బ్రహ్మానందం కామెడీ అంతగా ఆకట్టుకోవటంలేదనే వాదన వినిపిస్తోంది. అందుకనే పలువురు దర్శకులు, నిర్మాతలు బ్రహ్మానందానికి ప్రత్యామ్నాయంగా పృథ్వి,సప్తగిరి, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్ వంటి వారిని తీసుకుంటున్నారని అంటున్నారు. బ్రహ్మీకి రోజుకు రు.5 లక్షలు ఇచ్చేబదులు వీరిలో ఎవరో ఒకరిని తీసుకోవచ్చని భావిస్తున్నారు. పైగా జబర్దస్త్ కార్యక్రమం పుణ్యమా అని ఎందరో కొత్త కమెడియన్స్ వచ్చేస్తున్నారు… నవ్వులు పూయిస్తున్నారు. ఈ కారణాలన్నింటిరీత్యా బ్రహ్మీ షెల్ఫ్ లైఫ్ ముగిసిందనే వాదన వినిపిస్తోంది.