బ్రహ్మానందం లేని తెలుగు సినిమా కామెడీని ఊహించలేం. తెలుగు సినిమాలో అంతగా మమేకమైపోయాడు బ్రహ్మీ. అయితే ఆయన మెల్లమెల్లగా తెరమరుగవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఒక్క హిట్టు లేదు. కొత్త కొత్త కమెడియన్లు చెలరేగిపోతుంటే.. సీనియర్ బ్రహ్మానందం మాత్రం కనీసం తెరమీద కనపడడం లేదు.
బ్రహ్మానందానికి వరుసగా సినిమాలు కూడా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. 2014లో 19 సినిమాల్లో చేస్తే.. 2015లో 10 సినిమాల్లోనే బ్రహ్మానందం కనిపించాడు. ఇక 2016లో వస్తున్న భారీ సినిమాల్లో బ్రహ్మానందం లేడు. సోగ్గాడే చిన్న నాయనలో మాత్రం కనిపించనున్నాడు. తర్వాత ఎలుకా మజాకా అనే సినిమా కూడా ఉంది. ఈ రెండు కూడా ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలు. కొత్త ఏడాదిలో ఒక్క కొత్త సినిమా కూడా సంతకం చేసినట్టు కనిపించడం లేదు.
బ్రహ్మానందానికి సినిమాలు తగ్గాయా? లేక ఆయనే తగ్గించుకున్నారా? అనేదే సందేహం. కొన్ని దశాబ్దాలుగా షిఫ్టుల వారీగా సినిమాలు చేస్తూ.. వెయ్యికి పైగా సినిమాలతో గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కారు. ఒకవేళ కొంచెం రిలాక్స్ అవుదామని సినిమాలు తగ్గించుకున్నారా అనే అనుమానం కూడా ఉంది. కానీ భారీ పారితోషికాన్ని భరించలేకే దర్శక నిర్మాతలు పక్కనపెడుతున్నారన్న వాదన కూడా ఉంది. వీటన్నిటికంటే ఈ మధ్య కుర్ర కమెడియన్లు చెలరేగిపోతున్నారు. స్పూఫ్ లతో, పంచ్ లతో బ్రహ్మానందం లేని లోటును పూడుస్తున్నారు. కాబట్టి బ్రహ్మానందం తెరమీద కనిపించడం తగ్గి ఆఫర్ల కోసం కష్టాలు పడుతున్నాడని ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతోంది.