హీరోల తనయులు స్టార్స్ అయ్యారు. హీరోయిన్ల కూతుర్లూ రాణించారు. అయితే దర్శకుల వారసులు మాత్రం అనుకొన్న స్థాయిలో రాణించలేదు. హాస్య నటుల పుత్ర తర్నాలూ కొన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు గౌతమ్దీ అదే పరిస్థితి. పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో హీరో అయ్యాడు గౌతమ్. ఆ సినిమా సరిగా ఆడలేదు. ఆ తరవాత వచ్చిన వారెవా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎన్నో ఆశలు పెట్టుకొన్న బసంతి కూడా బాల్చీ తన్నేసింది. ఆ సినిమాకి తొలిసారి బ్రహ్మానందం రంగంలోకి దిగి… తనయుడు కోసం భారీ ప్రమోషన్లు చేయించాడు. అయినా ఫలితం దక్కలేదు. బసంతి తరవాత గౌతమ్ మరో సినిమా చేయలేదు. ఇప్పుడు మళ్లీ మొహానికి మేకప్ వేసుకొన్నాడట. ‘మధురం’ అనే షార్ట్ ఫిల్మ్‌తో ఆకట్టుకొన్న ఫణీంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పేరొందిన టెక్నీషియన్లు ఈ సినిమాకి పని చేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాని గప్‌చుప్‌గా పూర్తి చేసి. అప్పుడు ప్రమోషన్లు మొదలెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమాని తన వంతు సహయ సహకారాలు అందిస్తున్నాడట బ్రహ్మానందం. బ్రహ్మానందం రెండో కుమారుడు కూడా త్వరలోనే చిత్రరంగ ప్రవేశం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆయనేమో.. డైరెక్షన్ చేస్తాడట. మరోవైపు బ్రహ్మానందం కూడా త్వరలోనే మెగా ఫోన్ పట్టబోతున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా బిజీ అయిపోయారన్నమాట.