అరగుండుగా `అహనా పెళ్లంట`లో నవ్వించాడు బ్రహ్మానందం. అది మొదలు.. ఇప్పటి వరకూ వందలాది చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. పద్మశ్రీతో ప్రభుత్వం బ్రహ్మీని సత్కరించింది. గిన్నిస్ బుక్‌లోనూ స్థానం దక్కింది. గత కొంతకాలంగా.. బ్రహ్మీ కి సినిమాలు బాగా తగ్గాయి. ఇంటి పట్టునే ఉంటూ, పిల్లలతో కాలక్షేపం చేస్తున్నారు. అప్పుడప్పుడూ బొమ్మలు వేస్తూ – తనలోని మరో కోణాన్ని తన అభిమానులకు పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మానందం ఆత్మకథ రాస్తున్నార్ట.
బ్రహ్మానందం తన జీవితంలోని అన్ని ముఖ్య ఘట్టాలను.. ఛాయా చిత్రాలతో సహా, ఈ పుస్తకంలో పంచుకోబోతున్నారు. బ్రహ్మానందం స్వతహాగా సాహిత్యాభిలాషి. తెలుగు లెక్చలర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అందుకే… తన పుస్తకాన్ని తన స్వహస్తాలతో రాస్తున్నారని వినికిడి. ఈ యేడాదే ఈ పుస్తకాన్ని విడుదల చేయబోతున్నారు. తాను వేసిన బొమ్మలతో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది. మొత్తానికి ఈ ఖాళీ సమయాన్ని బ్రహ్మానందం బాగానే ఉపయోగించుకుంటున్నారు.