ఇటీవల బాలీవుడ్ నుంచి బ్రహ్మస్త్ర అనే సినిమాకి సంబంధించిన ట్రయిలర్ వచ్చింది. బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రమిది. రణవీర్, అమితాబ్, నాగార్జున… ఇలా హేమాహేమీలు కలిసి నటిస్తున్నారు. చిరంజీవి తెలుగు వెర్షన్‌కి వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో ఎస్.ఎస్.రాజమౌళి కూడా భాగస్వామి. దాంతో… ఈ ప్రాజెక్టుపై అందరి కళ్లూ పడ్డాయి. పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ సినిమాకి క్రేజ్ ఏర్పడింది. అత్యాసే అయినా… ఆర్.ఆర్.ఆర్, బాహుబలి, కేజీఎఫ్ రికార్డుల్ని బద్దలు కొట్టే సత్తా ఈ సినిమాకి ఉందని బాలీవుడ్ గట్టిగా నమ్ముతోంది. అయితే వాళ్లు కూడా… బ్రహ్మాస్త్ర టీజర్ చూసి షాకైపోతున్నారు. ఎందుకంటే.. టీజర్లో విజువల్స్ ఎఫెక్ట్స్ అలా ఉన్నాయి. వీఎఫ్ఎక్స్కి అధిక ప్రాధాన్యం ఉన్న కథ ఇది. అవి చూస్తే.. నాశిరకంగా తయారయ్యాయి. టీవీ సీరియల్స్ లో ఇంతకంటే మంచి వీఎఫ్ఎక్స్ వాడుతున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వీఎఫ్ఎక్స్ పరంగా ఈ సినిమా తేలిపోయింది. ఇప్పుడు ఈ టీజర్ చూసిన వాళ్లంతా.. ఆదిపురుష్ పై బెంగ పెట్టుకుంటున్నారు.
ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్నే కీలకం. దాదాపు 90 సన్నివేశాలు వీఎఫ్ఎక్స్లోనే రూపొందించారు. బాలీవుడ్ కి చెందిన స్టూడియోలే వీఎఫ్ఎక్స్ పనులు చేస్తున్నాయి. బ్రహ్మాస్త్ర గ్రాఫిక్స్ డిజైన్ చేసినవాళ్లే ఆదిపురుష్‌కి పనిచేయడం కంగారు పుట్టిస్తోంది. బ్రహ్మాస్త్ర లానే.. ఆదిపురుష్ గ్రాఫిక్స్ కూడా ఉంటాయేమో అన్నది ప్రభాస్ ఫ్యాన్స్ కంగారు. 2013 జనవరిలో ఈ సినిమా రాబోతోంది. అంటే.. గ్రాఫిక్స్‌కి చాలా సమయం ఉంది. కాకపోతే.. బ్రహ్మాస్త్ర స్టాండర్డ్‌లో ఆదిపురుష్ గ్రాఫిక్స్ ఉంటే తేడా కొట్టేయడం ఖాయం. అందుకే వీఎఫ్ఎక్స్ విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తగా ఉంటాడు. మనదేశంలో ఇన్ని గ్రాఫిక్ స్డూడియోలు ఉన్నా, విదేశాల్లోనే గ్రాఫిక్స్ చేయించుకొస్తారాయన. చిన్న బిట్టు కూడా… దగ్గరుండి డిజైన్ చేయించుకుంటారు. అంత ఓపిక, ప్రొఫెషనలిజం మిగిలిన దర్శకుల్లో కనిపించదు. అందుకే… రాజమౌళి సినిమాల్లో గ్రాఫిక్స్‌కీ, మిగిలిన సినిమాల్లో గ్రాఫిక్స్‌కీ అంత తేడా ఉంటుంది. బ్రహ్మాస్త్ర సినిమా మేకింగ్ లో రాజమౌళి సలహాలూ, సూచనలూ ఉన్నాయి. అయినా సరే.. గ్రాఫిక్స్ విషయంలో తేడా కొట్టేసింది. అదే.. బాడ్ లక్. మరి… ఆది పురుష్ గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో?