బాలీవుడ్ కి ఇప్పుడు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. భారీ సినిమాలు కూడా అక్కడ బోల్తా పడుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ దృష్టంతా `బ్రహ్మస్త్ర`పై ఉంది. రణబీర్ కపూర్, అమితాబ్, నాగార్జున… ఇలా స్టార్లంతా కలిసి చేసిన భారీ బడ్జెట్ సినిమా ఇది. విజువల్ ఎఫెక్ట్స్ కో్సం బాగా ఖర్చు పెట్టారు. ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నారు. రాజమౌళి ఈ టీమ్ లో ఓ భాగమైపోయాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఎన్టీఆర్‌ని తీసుకొస్తున్నారు. ఇలా ఎలా చూసినా `బ్రహ్మస్త్ర` పేరు మార్మోగిపోతోంది. తెలుగులో ఈ సినిమాకి మంచి బజ్ తీసుకుని రావడానికి చిత్రబృందం శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందుకే తెలుగులో సెలబ్రెటీల కోసం ప్రత్యేకంగా ఓ షో వేయాలని చూస్తున్నారు. ఈ ప్రీమియర్‌కి చిరంజీవిని ముఖ్య అతిథిగా తీసుకురావాలని ప్లాన్. ఓ రకంగా చిరు కూడా ఈ టీమ్ లో సభ్యుడే. ఎందుకంటే ట్రైలర్‌కి చిరు వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమాలోనూ చిరు గొంతు వినిపించబోతోంది. అలా.. బ్రహ్మాస్త్రలో చిరు హ్యాండ్ కూడా ఉంది. ఇప్పుడు తెలుగులో ఓ షో వేస్తే తమ ప్రచారానికి బాగా ఉపయోగపడుతుందని బ్రహ్మాస్త్ర టీమ్ భావిస్తోంది. అయితే… `లాల్ సింగ్ చద్దా` విషయంలోనూ ఇలాంటి హడావుడే కనిపించింది. చిరంజీవి కోసం ప్రత్యేకంగా ఓ షో వేశారు. ఆ తరవాత చిరు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడానికి ముందుకు రావడం, ప్రమోషన్లలోనూ విరివిగా పాల్గొనడం తెలిసిన విషయాలే. కానీ.. లాల్ సింగ్ చద్దా డిజాస్టర్ గా మిగిలిపోయింది. తెలుగులో ఈ సినిమాకి దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. మరి ఈసారి ఏం జరుగుతుందో..?