బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమ శాఖలోకి కలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులు చూసి అటు బీసీవర్గాలు ఇటు బ్రాహ్మణ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. తమను బీసీల్లో కలపాలని ఏ బ్రహ్మణ నేత కూడా అడిగి ఉండరు. అయినప్పటికీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ను తీసుకెళ్లి బీసీ సంక్షేమ శాఖలో ఎందుకు కలిపారో ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు దీనికి ప్రాతిపదిక ఏమిటో కూడా అంచనా వేయలేకపోతున్నారు. బీసీ కార్పొరేషన్లకు ఇప్పటికే పేరు గొప్ప పదవులు ప్రకటించారు. కానీ ఆ కార్పొరేషన్లకు నిధులు మాత్రం లేవు. అమ్మఒడి.. పెన్షన్లను కార్పొరేషన్ ఖాతాలో వేసి నిధులు బదిలీ చేసి ఇస్తున్నారు. ఆ మాటకొస్తే బ్రాహ్మణ కార్పొరేషన్ పరిస్థితి కూడా అంతే. పేపర్ మీద నిధుల కేటాయింపు చూపి వెంటనే బదిలీ చేస్తున్నారు.
ఇలాంటి నిధులు లేని పరిస్థితుల్లో బీసీల కిందకు బ్రాహ్మణులను తీసుకు రావడం ఏమిటో చాలా మందికి అర్థం కాలేదు. అయితే ఇక్కడా ఓ తిరకాసు ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల దేవాదాయశాఖ నిధులు మళ్లిస్తున్నారన్న ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. అమ్మఒడి వంటి పథకాలలో బ్రహ్మణ లబ్దిదారులు ఉంటే వారికి కార్పొరేషన్ కింద సాయం చేస్తున్నట్లుగా లెక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ దేవాదాయ శాఖ పరిధిలో ఉంది.
ఇలా లెక్కలు చూపించడానికి బ్రాహ్మణ కార్పొరేషన్ తరపున దేవాదాయ శాఖ నిధులు విడుదల చేస్తే అది భక్తుల సొమ్మును వాడుకుంటున్నారన్న అనుమానాలకు కారణం అవుతోంది. కోర్టుల్లో కేసులు పెడుతున్నాయి. ఈ చిక్కులు తప్పించుకోవడానికి అసలు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను దేవాదాయ శాఖ నుంచి తప్పిచాలని నిర్ణయించారు. కానీ ఎక్కడ కలపాలో తెలియ బీసీ సంక్షేమ శాఖ కిందకు కలిపేశారు. బీసీల్లో లేని బ్రాహ్మణుల సంక్షేమం ఇక బీసీ సంక్షేమ శాఖ చూస్తుందన్న మాట.