సినిమాల్లో ఫలితాల్లో జయాపజయాలు మామూలే.. విజయానికి పొంగిపోకూడదు, ప్లాఫ్ కు కుంగిపోకూడదు.. అంటూ గీతా సారాన్ని బోధించాల్సి వస్తోంది ‘బ్రహ్మోత్సవం’ యూనిట్ కి. ఆ సినిమా యూనిట్ తీరును గమనించి ఈ గీతా బోధ చేయాల్సి వస్తోంది. గమనిస్తున్న వాళ్లు చెబుతున్నది ఏమిటంటే.. బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయాకా, ఆ సినిమా యూనిట్ మొత్తం మొహం చాటేసింది అనేది! ఒక్కరంటే ఒక్కరు కూడా మీడియా ముందుకు రావడం కానీ, తమ తర్వాతి సినిమా గురించి ఏదైనా కబుర్లు చెప్పడం కానీ, బయట అవార్డుల ఫంక్షన్లలో కనిపించడం కాని చేయలేదు!
హీరోయిన్లను పక్కనపెడితే… హీరో మహేశ్ బాబు, నిర్మాత పీవీపీ, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. సినిమా విడుదల అయిన మరుసటి రోజు నుంచే మొహం చాటేశారు! డివైడ్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా ప్రచారం చేసుకోవడం తెలుగు సినీ పరిశ్రమలో అలవాటే. అలాంటి ప్రచారమే కొన్ని సినిమాలను గట్టెక్కిస్తూ ఉంటుంది. అయితే బ్రహ్మోత్సవం యూనిట్ మాత్రం అలాంటి ప్రచారాన్ని కూడా చేపట్టలేదు. తొలి రోజు డివైడ్ టాక్ వచ్చాకా.. సినిమా విషయంలో ముఖ్యమైన వాళ్లు మీడియా ముందుకు రావడం మానేశారు! దీంతో రెండో రోజును నెగిటివ్ టాక్ తీవ్రం అయ్యింది.
‘సరైనోడు’ వంటిసినిమాకు కూడా ముందుగా డివైడ్ టాకే వచ్చింది. కానీ.. ఆ సినిమా యూనిట్ ప్రచారాన్ని హోరెత్తించింది అక్కడి నుంచి. హీరో, దర్శకుడు.. తమ సినిమాపై గట్టిగా ప్రచారం చేశారు. దీంతో కనీసం ఒక వర్గం అయినా ఆ సినిమా పట్ల ఆసక్తి ప్రదర్శించింది. చివరకు మంచి కలెక్షన్లతో అది బయటపడింది. అందుకు విరుద్ధంగా వ్యవహరించిన ‘బ్రహ్మోత్సవం’ యూనిట్ తీరుతో ఆ సినిమాపై గట్టి దెబ్బే పడింది. ఆ సినిమా ప్రచారం సంగతిపక్కన పెడితే.. బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత సోషల్ గా కూడా మహేశ్, పీవీపీ, శ్రీకాంత్ అడ్డాలు కనిపించలేదు. సినిమా విడుదలకు ముందు అంతటా కనిపించిన వీళ్లు.. ఎక్కడా కనపడకుండా లోప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్నారు. మరి ఇదంతా బ్రహ్మోత్సవం డిజాస్టర్ మిగిల్చిన డిప్రెషనేనా?