బ్రహ్మోత్సవం రిజల్ట్ తేలిపోయింది.. ఈ సినిమా ఫ్లాప్ అనే ముద్ర పడిపోయింది. శుక్రవారం ఉదయమే.. పీవీపీకి రిజల్ట్‌పై ఓ క్లారిటీ వచ్చేసింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రిమ్మింగులకు దిగిపోయి 12 నిమిషాల సినిమా లేపేశారు. సినిమా ఎక్కడ ల్యాగ్ అయ్యిందో, ఎక్కడ బోర్ కొడుతుందో, ఏ సన్నివేశం అనవసరం అనిపిస్తోందో రిలజ్ట్ వచ్చే వరకూ ఆగాలా? ఆ మాత్రం క్లారిటీ దర్శక నిర్మాతలకూ, సూపర్ స్టార్ అని పిలవబడే హీరోలకూ ఉండదా? బ్రహ్మోత్సవం అనే కాదు.. ప్రతీ సినిమా పరిస్థితి ఇంతే. సినిమా ఫ్లాప్ అన్న టాక్ వస్తే చాలు.. కత్తెర్లు పట్టుకొని దిగిపోతారు. ఆ జాగ్రత్త ముందు ఏమైపోయింది?
స్ర్కిప్టు రాసుకొన్నప్పుడో, దాన్ని షూట్ చేసుకొంటున్నప్పుడో, తీసింది ఎడిటింగ్రూమ్లో చూసుకొంటున్నప్పుడో వాళ్లకు అర్థం కాదా? ఈ సీన్ అనవసరం అని అనిపిస్తే.. దాన్ని రాసుకోవడం ఎందుకూ, తీసుకోవడం ఎందుకు, ఆనక కత్తిరించుకోవడం ఎందుకు? పాత రోజుల్లో స్ర్కిప్ట్ ఎంత పద్ధతిగా రాసుకొనేవాళ్లో. సీన్ నిడివి ఎంత? అనేది కూడా స్ర్కిప్టులో నిక్షిప్తమై ఉండేది. ఆ సీన్ ఎప్పుడు తీస్తాం, శీతాకాలమా, ఎండాకాలమా? ఆర్టిస్టులు ఎంతమంది? బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఇవన్నీ పక్కాగా కాగితంపై ఉండేది. ఇప్పుడు ఆ పద్ధతే పోయింది. సెట్‌కి వెళ్లి సీన్ గురించి ఆలోచించుకొనే ప్రబుద్ధ దర్శకులున్నారు. సినిమా తీశాక, దాన్ని బయటకు వదిలాక… ఇప్పుడు కత్తెర్లు పట్టుకొన్నారంటే తీసిన దానిపై దర్శకుడికే క్లారిటీ లేదన్నమాట. సినిమా అనేది వ్యాపారం. కోట్లు పెట్టుబడి పెడతారు. ఇలాంటి చోట అంత నిర్లక్షమా?? సన్నివేశం ఏమిటి? ఎందుకు తీస్తున్నాం అనే క్లారిటీ దర్శకుడిక లేకపోతే.. ఇదిగో ఇలాంటి పరిస్థితే వస్తుంది. సినిమా తగలడపోయాక.. నీళ్లు చల్లితే లాభం ఏమిటి? దర్శకురాలా.. మేల్కోండి.