‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేష్ నటించిన పర్ఫెక్ట్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బ్రహ్మోత్సవం’. భారి సెట్స్, భారి తారాగణం తో, పి వి పి,& జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ బ్యానర్స్స్ లో సీతమ్మ వాకిట్లో…దర్శకుడు శ్రీ కాంత్ అడ్డాల, దర్శకత్వం లో ప్రసాద్ వి .పొట్లూరి, మహేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం మే 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే.. ట్రైలర్స్, ప్రోమోస్, మహేష్ పర్సనల్ గా చేసిన ప్రమోషన్ తో ఈ చిత్రానికి భారి అంచనాలు నెలకొన్నాయి. దానికి అనుగుణంగా అభిమానులు కూడా ‘బ్రహ్మోత్సవం’ కోసం ఉత్చాహం తో ఎదురు చూస్తున్నారు. ఈ రోజు విడుదల అయిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఆభిమానుల అంచనాలను, ప్రేక్షకులను ఆకట్టు కునేలా ఉందా.? లేదా.? అన్నది ఇప్పుడు చూద్దాం….
కథ:
ఒక మనిషి నలుగురి మధ్య ఉండాలనే ఆలోచన నుంచి వచ్చిన కథనే బ్రహ్మోత్సవం..కుటుంబాల మద్య దూరం పెరుగుతున్న సమయం లో కుటుంబ విలువలు , మనుషుల మద్య ప్రేమ అనురాగాలు ఇలా అన్ని కలబోసి ‘బ్రహ్మోత్సవం’ గా ప్రేక్షకులందరూ పంచుకునేల ఈ చిత్రాన్ని రూపొందించారు శ్రీ కాంత్ అడ్డాల. కథ విషయానికొస్తే…విజయవాడలో ఓ ప్రముఖ వ్యాపారవేత్త అయిన చంటబ్బాయి (సత్య రాజ్) తన మామగారు ఇచ్చిన నాలుగు వందల రూపాయలతో, కష్ట పడి నాలుగు వందల కోట్ల విలువైన రంగుల ఫ్యాక్టరీ స్తాపించుకుంటాడు. అతడి చెల్లెళ్ళు, వాళ్ళ కుటుంబాలు, అంతా కలిసి ఉత్సవంలా ఒకచోట ఉండి జీవితాలను గడుపుతుంటారు. మంచి మాట అన్నా, మంచి మనుషులన్న ఆయనికి ప్రాణం. అతనికి నలుగురు బావ మరుదులు (రావు రమేష్ )(సాయాజీ షిండే)(కృష్ణ భగవాన్) (సీనియర్ నరేష్ ) చంటబ్బాయి లాంటి ఆలోచనలున్న వ్యక్తే అతడి కుమారుడు మహేష్. ఏదీ పెద్దగా ఆలోచించకుండానే చేసేసే మనస్థత్వం ఉన్న మహేష్, ఎవ్వరితోనైనా ఇట్టే కలిసిపోయి సరదాగా ఉంటూ,ఏ టెన్షన్ లేకుండా, తండ్రి వ్యాపారాలు చూసుకుంటూ ఉంటాడు. పెద్ద బావ మరిది రావు రమేష్ కి మొదటి నుండి బావ పద్ధతి అసలు నచ్చదు తనేంటి? బావ పైన ఆధార పడటమేమిటి?అని, భార్య జయ సుధ సలహా మేరకు రావు రమేష్ కూతురు(ప్రణిత) ని తన బావ కొడుకైన మహేష్ కి ఇచ్చి పెళ్లి చేద్దామనే ఆలోచనలో వుంటారు. అదే టైం లో శుభలేఖ సుధాకర్, ఆస్ట్రేలియా నుండి ఇండియా కి వచ్చిన తన కూతురు కాశి (కాజల్ అగర్వాల్) ను చంటబ్బాయి ఇంట్లో వుంచుతాడు. తొలి చూపు లోనే మహేష్, కాజల్ ప్రేమలో పడతారు. వీళ్ళ ప్రేమ కలాపాలను చూసిన రావు రమేష్, చంటబ్బాయి తో గొడవ పడతాడు. ఆ గొడవ తర్వాత చంటబ్బాయి చనిపోవడంతో, ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇలా మారిపోయిన పరిస్థితుల నుంచి, బంధాలంటే ఏంటో, తానేంటో తెలుసుకోవాలనే ప్రయత్నంలో మహేష్, సమంతతో కలిసి ఓ ఏడు తరాల చుట్టరికాల ఆచూకి కోసం ఓ ప్రయాణం మొదలుపెడతాడు. ఆ ప్రయాణం ఏంటి? సమంత ఎవరు? ఈ ప్రయాణంలో మహేష్ ఏమేం తెలుసుకున్నాడూ? చివరకు తన ఇంట్లో పరిస్థితులను మార్చేందుకు అతడికి ఆ ప్రయాణం ఎలా ఉపయోగపడిందీ? కాశి తో అతడి తొలిప్రేమ కథేంటీ? లాంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్ :
సూపర్ స్టార్ మహేష్ ఎప్పట్లానే ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలబడి, సినిమాను తన చరిష్మాతో ముందుకు నడిపించాడు. భాద్యత గల కుర్రాడిగా సహజ మైన నటనతో, ఇలాంటి కథను తన స్టార్ స్టేటస్ గురించి ఆలోచించకుండా, నిజాయితీగా కథకే కట్టుబడి ఉంటూ చేయడమనేది మహేష్ గట్స్ కి మెచ్చుకోవలసిందే! నటనలో మహేష్ స్థాయి ఏంటన్నది ఇప్పటికే చాలా సినిమాలు రుజువు చేసాయి. బ్రహ్మోత్సవం లో కూడా ఇదే అంశాన్ని మరోసారి చూపించాడు. ఆయన స్థాయి మరింత ఎత్తుకు తీసుకెళ్ళింది. ఇక హీరోయిన్స్ కాజల్, సమంత, ప్రణిత లు తన పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. మహేష్-కాజల్‌ల ప్రేమకథ కూడా సహజంగా ఉంది. కాజల్ ఈ సినిమాలో తాను ఇంతకుముందెప్పుడూ చేయని తరహా పాత్రలో చూపిన ప్రతిభ చాలా బాగుంది. మహేష్-సమంతల కాంబినేషన్లో వచ్చే జర్నీ బాగుంది. ఇక ప్రణీతది చిన్న పాత్రైనా బాగా చేసింది.సపోర్టింగ్ పాత్రలో రావు రమేష్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. కథను బలంగా ప్రభావితం చేసే పాత్రలో ఆయన నటన కట్టిపడేసేలా ఉంది. ఆప్ప్డప్పుడు తండ్రి రావు గోపాల రావు 3 డి అనిమేషన్ కారెక్టర్ అలరించింది. సత్యరాజ్ ఓ బలమైన పాత్రలో సినిమాకు నిండుతన తెచ్చారు. ఇక రేవతి, జయసుధ, నరేష్, తులసి, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి.. ఇలా సినిమాలో కీలక పాత్రల్లో నటించిన వారంతా తమ తమ నటనతో ఆకట్టు కున్నారు.
సాంకేతిక వర్గం:
ఒక మనిషి నలుగురి మధ్య ఉండాలనే ఆలోచన నుంచి వచ్చిన ఈ కథ సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ‘బ్రహ్మోత్సవం’ అన్నివిధాలా బాగుందనే చెప్పుకోవచ్చు. శ్రీకాంత్ అడ్డాల రచనలో ఎంత లోతుందో, తాను చెప్పాలనుకున్న అంశాలను కథగా తెలివిగా చెప్పించిన విధానం చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. కథ చిన్నదే అయినా, దాన్ని కథనం గా చెప్పడానికి ఏమేం కావాలో వాటన్నింటితో ఓ మంచి స్క్రీన్‌ప్లే రాసుకోవడం లాంటి విషయాల్లో శ్రీకాంత్ అడ్డాల ప్రతిభను చూడొచ్చు. డైలాగ్స్ పరంగానూ శ్రీకాంత్ మరోసారి తన స్థాయిని చాటుకున్నాడు. మల్టి స్టారర్ చిత్రం తర్వాత శ్రీకాంత్ ‘బ్రహ్మోత్సవం’ దగ్గరకొచ్చేసరికి స్టార్ బ్రాండ్‌ని అలాగే నిలబెట్టుకున్నాడు అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు సరదాగా సాగిన…సెకండ్ హాఫ్ వచ్చేసరికి, మహేష్-సమంతల ఏడు తరాల చుట్టరికాల జర్నీ. దానికి ముందొచ్చే సన్నివేశాలేవీ అంత బలంగా లేకపోవడంతో, ఈ జర్నీ లాజిక్ లేని విషయంగా కనిపిస్తుంది. ఇక కొన్ని సన్నివేశాలు తిరిగి తిరిగి అక్కడికే వస్తున్నాయన్నట్లుగా సెకండాఫ్‌లో ఈ ఎపిసోడ్ సాగుతూంటుంది. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! సాధారణంగా తెలుగు సినిమాల్లో కనిపించని, బాలీవుడ్‌కు మాత్రమే సాధ్యమనుకున్న ఓ ఫ్లేవర్‌ను ఈ చిత్రం లో చూడొచ్చు. అది రత్నవేలు ప్రతిభ వల్లే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మిక్కీ జే మేయర్ సమకూర్చిన పాటలు రెండు బాగున్నాయి, మణి శర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి పాయింట్ అవుట్ చేయలేము. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ బాగుంది. తోట తరణి ఆర్ట్ వర్క్ గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ఆయన స్థాయి ఎంతటిదో ఈ సినిమా మరోసారి ఋజువు చేసింది. పీవీపీ సినిమా నిర్మాణ విలువలను ప్రశంసించకుండా ఉండలేం.
విశ్లేషణ :
సూపర్ స్టార్ మహేష్ లాంటి స్టార్‌తో, కమర్షియల్ సినిమా హంగులను ఏమాత్రం పట్టించుకోకుండా, ఓ కథ చెప్పాలన్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సాహసాన్నే ఈ సినిమాకు అన్నింటికీ మించిన ప్రధానమైన అనుకూలాంశంగా చెప్పుకోవాలి. నలుగురికి మంచి పంచుతూ, అందరితో కలిసిమెలిసి ఉండడమనే ప్రధానాంశాన్ని సినిమా కథలో అంతర్లీనంగా చెప్పిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే! ఇక మానవ సంబంధాలను, ఉమ్మడి కుటుంబంలోని ఆలోచనా విధానాలు, భావోద్వేగాలను శ్రీకాంత్ అడ్డాల తనదైన ముద్ర కనిపించేలా చెప్పిన విధానం కూడా చాలా బాగుంది.ఈ సినిమాకు ప్రధానమైన ప్రతికూలాంశం అంటే, కథ వేగం చాలా నెమ్మదిగా ఉండడమని చెప్పుకోవాలి. సెకండాఫ్‌లో మహేష్-సమంతల జర్నీ, దానికి ముందొచ్చే సన్నివేశాలేవీ అంత బలంగా లేకపోవడంతో, ఈ జర్నీ లాజిక్ లేని విషయంగా కనిపిస్తుంది. ఇక కొన్ని సన్నివేశాలు తిరిగి తిరిగి అక్కడికే వస్తున్నాయన్నట్లుగా సెకండాఫ్‌లో ఈ ఎపిసోడ్ సాగుతూంటుంది. ఇక సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో కోరుకునే అంశాలేవీ లేని సినిమా కావడం కూడా అలాంటి అంశాలను కోరేవారికి నచ్చకపోవచ్చని విషయంగా చెప్పుకోవచ్చు. సమంత కథలోకి ఎంట్రీ ఇచ్చిన విధానం కూడా పెద్దగా ఆకట్టుకోదు. ఇక కొన్నిచోట్ల విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా లేవు. మహేష్ కాజల్ ప్రేమ సన్నివేషాలు అసహజం గా వున్నాయి. వీళ్ళ ప్రేమకు కథ కు ఎలాంటి లింక్ వుండదు ఒక్క రావు రమేష్ గొడవ పడటానికి తప్ప. శ్రీకాంత్ అడ్డాల కథగా చెప్పాలనుకున్న ఆలోచన, కట్టిపడేసే కొన్ని భావోద్వేగాలు, ప్రయాణాలు ఇవన్నీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఇకపోతే కథ చాలా నెమ్మదిగా సాగడం, సెకండాఫ్‌లో కొన్ని లాజిక్‌కి సంబంధం లేని అంశాలు లాంటివి మైనస్ పాయింట్స్‌గా చెప్పుకోవాలి. కాని ముగింపు లో రావు రమేష్ కూతురి పెళ్లి లో సన్నివేశం మాత్రం ఆకట్టుకుంటుంది. ఇక మహేష్ సమంతాల జర్నీ లో వచ్చిన అవుట్ పుట్ ఏ మాత్రం క్లైమాక్స్ కి ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఏడు తరాల మూలాల్ని వెతికే ప్రయాణంలో బంధాల్ని అర్థం చేసుకోవచ్చని, ఆ బంధాలు అలా సాగడమే ‘బ్రహ్మోత్సవం’ అని చెప్పే ఆలోచనకు కనెక్ట్ అయితే, ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు.
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5
బ్యానర్ : పి వి పి సినిమా, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ తో కలిసి…
నటీనటులు : మహేష్ బాబు, కాజల్ అగర్వాల్, సమంతా రూత్ ప్రభు, ప్రణిత సుభాష్, సీనియర్ నరేష్, సత్య రాజ్, రావు రమేష్, ముఖేష్ రిషి, తనికెళ్ళ భరణి, వెన్నెల కిశోర్, నాజర్, జయ ప్రకాష్, సాయాజీ షిండే, కృష్ణ భగవాన్, పోసాని కృష్ణ మురళి, కాదంబరి కిరణ్, జయ సుధ, రేవతి, శరణ్య పోవన్నాన్, తులసి, ఈశ్వరి రావు, పావని గంగి రెడ్డి, చాందిని చౌదరి,
కెమెరా :అర్.రత్నవేలు,
ఆర్ట్ :తోట తరణి
పాటలు : సిరి వెన్నెల సితారామ శాస్త్రి , కృష్ణ చైతన్య, శ్రీ కాంత్ అడ్డాల,
ఫైట్స్: రామ్ లక్ష్మన్,
ఎడిటింగ్ :కోటగిరి వెంకటేశ్వర్ రావు,
సంగీతం : మిక్కి జె మేయర్,
నేపధ్య సంగీతం : మణి శర్మ,
నిర్మాతలు : ప్రసాద్ వి .పొట్లూరి, మహేష్ బాబు,
కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం :శ్రీ కాంత్ అడ్డాల,
విడుదల తేదీ : 20 మే 2016