Bramayugam Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.75/5
-అన్వర్
చరిత్రతో ముడిపడిన ఓ జానపద కథకు హారర్ టచ్ ఇవ్వాలనుకునే ఆలోచనే వైవిధ్యమైయింది. ఇలాంటి కొత్త ఆలోచనతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళం స్టార్ మమ్ముట్టి ‘భ్రమయుగం’. ఇప్పటికే మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదలైయింది. మూడు పాత్రలతో సినిమా నడపించడం ఒక సవాల్ అయితే, దాన్ని బ్లాక్ అండ్ వైట్ లో తీసి మెప్పించడం ఇంకా పెద్ద సవాల్. మరి ఇలాంటి కొత్త పంధాలో వచ్చిన ‘భ్రమయుగం’ ప్రేక్షకుల్ని అలరించిందా? చరిత్ర, జానపదం, హారర్ సమ్మిళితమైన ఈ కథ ఎలాంటి అనుభూతిని పంచింది?
అది 17వ శతాబ్దం. దేవన్ (అర్జున్ అశోకన్) ఓ రాజు ఆస్థానంలో జానపద గాయకుడు. అనుకోని ఓ ప్రయాణంలో మలబారు తీరంలోని అడవి గుండా వెళ్తూ దారితప్పుతాడు. ఆకలితో తిరుగుతూ చివరకు పాడుబడిన ఓ పెద్ద భవంతిలోకి చేరుకుంటాడు. ఆ ఇంట్లో కుడుమోన్ (మమ్ముట్టి), వంట మనిషి (సిద్ధార్థ్ భరతన్) మాత్రమే ఉంటారు. కుడుమోన్ ఆ ఇంటి యజమాని. దేవన్ గురించి తెలుసుకొని ఓ పాట పాడమని అజ్ఞాపిస్తాడు. దేవన్ పాడిన పాట కుడుమోన్ కి నచ్చుతుంది. అన్ని అతిథి మర్యాదలు చేసి ఇక ఇక్కడే వుండిపోమని ఆర్డర్ వేస్తాడు. పాడుపడిన ఇంట్లో ఉన్న పరిస్థితులు చూసి దేవన్ కు చాలా అనుమానాలు వస్తాయి. ఒక దశలో తాను కుడుమోన్ ఉచ్చులో చిక్కుకుపోయానని అతనికి అర్థమవుతుంది. ఆ ఇంటి నుంచి తప్పించుకు పారిపోవాలని ప్రయత్నించినప్పటికీ కుడుమోన్ తాంత్రిక విద్య వల్ల దేవన్ మళ్లీ వెనక్కి రావాల్సివస్తుంది. ఇంతకీ కుడుమోన్ ఎవరు? అతనికి తాంత్రిక విద్యలు ఎలా వచ్చాయి? తాంత్రికుడైన కుడుమోన్ తో కలిసి వంట మనిషి ఎలా ఉంటున్నాడు? చివరిగా దేవన్ ఆ ఇంటి నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది తక్కిన కథ.
చరిత్రలో ‘పవర్’ కోసం జరిగిన పోరాటాలే ఎక్కువ. భ్రమయుగం బయటికి హారర్ సినిమాలా కనిపిస్తున్నా ఇందులో అంతర్లీణమైన కథ మాత్రం ‘పవర్’ గేమ్. ఈ సినిమాని హారర్ కోణంలో చూస్తే కాస్త నిరాశపడొచ్చేమో కానీ దర్శకుడు చెప్పదలచుకున్న కథలోని అసలు సారం అర్థం చేసుకొని సినిమా చూస్తే మాత్రం హారర్ సినిమాల్లో ఇదొక కొత్త ప్రయత్నం అనిపిస్తుంది. యక్షి పాత్ర దేవన్ మిత్రుడిని అడవిలో చంపిన ఓ భయానక దృశ్యంతో ఈ కథ మొదలౌతుంది. తొలి సన్నివేశంలోనే కథలోకి తీసుకెళ్ళిన దర్శకుడు తర్వాత కుడుమోన్, అతడి ఇల్లు, ఆ పరిసరాలు చాలా ప్రభావంతంగా చూపించి ప్రేక్షకులని ఆ ప్రపంచంలో లీనమయ్యేలా చేశాడు. కుడుమోన్ పాత్రని పరిచయం చేసే సన్నివేశాలు చాలా పకడ్బందీగా తీర్చిదిద్దారు. ఆ పాత్ర స్వభావాన్ని తెలియజేయడానికి చాలా సన్నివేశాలు రాసుకొన్నారు. అవన్నీ కొంచెం నిదానంగా సాగదీసినట్లుగా అనిపించినప్పటికీ ‘పవర్’ తో వున్న అతనిలో క్రూరత్వాన్ని, ఆలోచన ధోరణి చాలా లోతుగా చూపిస్తాయి. దేవన్ ఆ ఇంట్లో రాత్రుళ్ళు తిరగడం, వింత వింత సౌండ్లు, దేవన్, కుడుమోన్ అడే జూదం.. 17వ శతాబ్దం నాటి పద్దతులని గుర్తు చేసే వంటగది, చేసే వంటకాలు.. ఇవన్నీ చాలా సహజంగా ప్రాణం పోసుకున్నట్లుగా చూపించారు. ఇంటర్వెల్ లో వచ్చే మలుపు కూడా ఆసక్తికరంగా వుంటుంది.
సెకండ్ హాఫ్ కథలో వేగం పెరుగుతుంది. కుడుమోన్ నేపధ్యం, చేతన్ కథ ప్రేక్షకులకు థ్రిల్ ని పంచుతాయి. ఇందులో వర్షం కూడా ఒక పాత్రలా కనిపించడం విశేషం. దేవన్ అక్కడి నుంచి బయటపడటానికి అన్ని దారులు మూసుకున్న తర్వాత అసలు ఇంత బలవంతుడి నుంచి ఎలా బయటపడతారు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కూడా కలగడం దర్శకుడి ప్రతిభకి అద్దం పడుతుంది. కుడుమోన్ ని బురిడి కొట్టించడానికి దేవన్, వంటవాడు చేసిన ప్లాన్ రక్తి కడుతుంది. నేలమాళిగలోని అఖండ జ్యోతి, దానిని ఆర్పడానికి చేసిన ప్రయత్నాలు మంచి థ్రిల్ పంచుతాయి. క్లైమాక్స్ కూడా బలంగానే వుంటుంది. మొదట్లో టచ్ చేసి వదిలేసినా కుల వివక్ష, పవర్ గేమ్ ని జస్టిఫై చేయడానికి చివర్లో ఉంగరం రూపంలో రాసుకున్న డ్రామా బావుంది. లోతుగా పరిశీలిస్తే..ఆ సన్నివేశాల్లో సమాజంలో ‘పవర్’ గేమ్ కి సంబధించిన చాలా అంశాలు బోధపడతాయి.
అయితే ఇందులో లోపాలు లేకపోలేదు. కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. మలయాళ సినిమాల్లో డిటెయిలింగ్ అవసరానికి మించి వుంటాయి. సీరియస్ గా సినిమా చూసే వాళ్ళకి, ఫిల్మ్ మేకర్స్ కి ఇది నచ్చుతుందేమో కానీ అంత స్లో నెస్ భరించడం సగటు ప్రేక్షకుడి కష్టమే. అలాగే ఇందులో హారర్ గొప్పగా వుంటుందని భావిస్తే మాత్రం నిరాశతప్పదు. తొలి సగంలో ఎక్కువ భాగం కథని ఓపెన్ చేయకుండా కేవలం బిల్డప్ కోసమే వాడుకున్నారనే భావన కలిగే అవకాశం వుంది. అంత పవర్ ఫుల్ గా చూపించిన కుడుమోన్ పాత్రని చివర్లో గాలి తీసినట్లుగా చేసిన విధానం కూడా అంత రిజినబుల్ గా అనిపించదు.
మమ్ముట్టి కెరీర్ లో మరో మెమరబుల్ పాత్ర కుడుమోన్. తన ముఖాన్ని రివిల్ చేసే తొలి సన్నివేశాల్లో రోమాలు నిక్కబోడుచుకుంటాయి. అంత ఎఫెక్టివ్ గా లుక్, ఎక్స్ ప్రెషన్స్ వున్నాయి. ఆయన కిళ్లీ నములుతున్నా భయం పుడుతుంది. ఆయనకి తెలుగు డబ్బింగ్ చెప్పిన ప్రియదర్శిని రామ్ బేస్ వాయిస్ పాత్రకు ప్లస్ అయ్యింది. దేవన్ పాత్రలో అర్జున్ అశోకన్ చక్కగా రాణించాడు. ఆయన కళ్ళలో భయాన్ని ప్రేక్షకుడు కూడా ఫీలౌతాడు. వంటవాడుగా పాత్రలో సిద్ధార్థ్ బలమైన పాత్రలో కనిపించాడు. ఆ పాత్రలోని ట్విస్ట్ బావుంటుంది. ఈ మూడు పాత్రలే సినిమాని నడిపించేశాయి. యక్షి పాత్రకు మాత్రం సరైన ముగింపు ఇవ్వలేదు.
టెక్నికల్ గా సినిమా ఉన్నతస్థాయిలో వుంది. కుడుమోన్ ఇంటిని భలే ఊహించి చిత్రీకరించారు. ఓ వింత ప్రపంచంలా వుంటుంది ఆ ఇల్లు. నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా సెట్ ప్రాపర్టీని 17శతాబ్దం పరిస్థితులని చూపించే విధంగా మలిచారు. ఆ వంటగది, అతను చేసే వంట, అక్కడ వున్న పరికరాలు ఇవన్నీ చాలా ప్రామాణికంగా ఉంటూ ప్రేక్షకుల్ని లీనం చేస్తాయి. నేపధ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆద్యంతం థ్రిల్ పంచేలా వుంది బీజీఎం. బ్లాక్ అండ్ వైట్ లో కూడా చాలా డెప్త్ తీసుకొచ్చారు. తెలుగు డబ్బింగ్ బాగానే కుదిరింది. సీరియస్ సినీ గోయర్స్ కి, క్రాఫ్ట్ ని ఇష్టపడే వారికి, ప్రయోగాత్మక చిత్రాలని చూసేవారికి నచ్చే సినిమా ఇది. కమర్షియల్ గా వర్క్ అవుట్ అయితే మాత్రం నిర్మాతల అదృష్టమే.
తెలుగు360 రేటింగ్: 2.75/5
-అన్వర్