brand babu movie review
తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5
బ్రాండ్ బాబు సినిమాలో ఓ డైలాగు వుంది..’బ్రాండ్ దుస్తులు వేసుకున్నంత మాత్రాన పనిమనిషి ఇంటి మనిషి అయిపొతుందా?’ అన్నది ఆ డైలాగు. అదే డైలాగు ఆ సినిమాకు కూడా వర్తిస్తుంది. మారుతి సమర్పించు, మారుతి నిర్మించు, మారుతి కథ మాటలు అని వేసుకున్నంత మాత్రాన, అది కాస్తా భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమా అయిపోదు. విషయం వుండాలి. మనిషికయినా, సినిమాకయినా. అప్పుడే బ్రాండ్ అదనపు అర్హత అవుతుంది.
మతిమరపు, అతి శుభ్రత, అతి మంచితనం వంటి కాన్సెప్ట్ క్యారెక్టర్లతో సినిమాలు అందించిన దర్శకుడు మారుతి తయారుచేసిన మరో క్యారెక్టర్ బ్రాండ్ ల పిచ్చి వున్న కుర్రాడు. అయితే ఈ సారి దర్శకుడు మారుతి కేవలం కథ మాటలు అందించి చేతుల దులుపుకున్నారు. సీరియళ్ల డైరక్టర్ నుంచి సినిమా డైరక్టర్ కావాలనుకుంటున్న ప్రభాకర్ మెగాఫోన్ పట్టుకున్నారు. అయితే కథలోనూ, క్యారెక్టర్ లోనూ క్లారిటీ లోపించి, సినిమా ఎక్కడెక్కడో తిరిగి, బ్రాండ్ అంతగా బాలేదు అనిపించేస్తుంది. ఇదే అమెజాన్ సరుకు అయితే రిటర్న్ అవకాశం వుండేది. ఇక్కడ సినిమాను వెనక్కు పంపాలి తప్ప, డబ్బులు వెనక్కు రావు.
ఓ బడా బాబు (మురళీ శర్మ) ఉగ్గుపాలతో కొడుకు కు (సుమంత్ శైలైంద్ర) బ్రాండ్ ల పిచ్చి నూరి పోస్తాడు. దాంతో అతగాడు పెరిగి, బ్రాండ్ వుంటే తప్ప మెతుకు ముట్టడు, ఫ్యాంట్ జిప్ విప్పడు అన్నట్లు తయారవుతాడు. అలాంటి వాడు అనుకోకుండా ఓ పేదింటి అమ్మాయిని (ఈషా రెబ్బా) ప్రేమించాల్సి వస్తుంది. కానీ తప్పు దిద్దుకుందామంటే, జింకలా అంటుకుని కుటుంబాన్నే బాధపెడుతుంది. అప్పుడు ఏం జరిగింది అన్నది మిగిలిన సినిమా.
టీవీ సీరియళ్లకు ఓ సౌలభ్యం వుంటుంది. ఎన్నాళ్లు కావాలంటే అన్నాళ్లు సాగదీసుకోవచ్చు. ఏవారానికి ఆవారం ఏదో టాపిక్ దొరుకుతుంది. దాన్ని సీరియల్ లో దూర్చేయచ్చు. వినాయకచవితి వస్తే, సీరియల్ లో ఇంటిల్లిపాదీ వినాయక చవితి ఎలాచేసుకున్నారు అన్నది చూపిస్తే ఓ వారం గడిచిపోతుంది. అలాగే ఏదో ఒకటి ఏ వారానికి ఆ వారం చేసుకోవచ్చు. మరి సీరియళ్లను డైరక్ట్ చేసే ప్రభాకర్ సినిమాను డైరెక్ట్ చేస్తే ఎలా వుంటుంది? బ్రాండ్ బాబు మాదిరిగా వుంటుంది.
బ్రాండ్ బాబు సినిమా ముందు స్మూత్ గానే టేకాప్ అవుతుంది.
కానీ హీరో ప్రేమ వ్యవహారం మొదలయిన దగ్గర నుంచి సినిమా గాడి తప్పడం ఆరంభమవుతుంది. ఇద్దరు అమ్మాయిలను చూసి ఒకళ్లతో అనుకుని మరొకళ్లతో ప్రేమలో పడిన వ్యవహారం సినిమాలో హీరోకి కాకుండా, డైరక్టర్ కు పూర్తిగా క్లారిటీ మిస్ అన్నట్లు సాగుతుంది. తీరా హీరోకి హీరో ప్యామిలీకి క్లారిటీ వచ్చాక, సినిమా పూర్తిగా గాడి తన్నేస్తుంది. ఏదో చేద్దామనుకుని, మరేదో చేయబోయి, ఇంకేదో చేసినట్లు అనుకుంటూ, ఏదేదో చేసేసాడు దర్శకుడు. మరి ఇది మారుతి ఇచ్చిన స్క్రిప్ట్ తో సమస్యనో? లేక డైరక్టర్ స్వంత కవిత్వమో? వాళ్లకే తెలియాలి.
అసలు హీరో తండ్రిది బ్రాండ్ పిచ్చా? డబ్బు తెచ్చిన ఇగోనా? ఇంకేదోనా? అన్నది క్లారిటీ లేదు. అసలు సినిమాను కామెడీగా తీద్దామనా? ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా తీద్దామనా? లేక యూత్ ఫుల్ గా తీద్దామనా? ఈ క్లారిటీ కూడా సినిమాలో మిస్ నే. ఒక్కోసారి ఒక్కోటి తెరపైకి వస్తుంటుంది. హీరో కుటుంబం సంఘ బహిష్కరణ వ్యవహారం అంతా ఓ ప్రహసనం మాదిరిగా సాగుతుంది. అర్థం, పర్థం వుండదు. లాజిక్ అసలే వుండదు. తిండిలేక అలమటించే బదులు అంతటి మహా కోటీశ్వరులు విదేశాలకో, మరో రాష్ట్రానికో వెళ్లి ఓ నెల రోజులు హాయిగా ఎంజాయ్ చేసి రాలేరా?
చాలా సీన్లు నవ్వుకుందామన్నా అవకాశం ఇవ్వవు. సీరియస్ సీన్లు చూస్తుంటే, ఈ సబ్జెక్ట్ కు, ఈ సినిమాకు ఈ సీన్లు అవసరమా అని నవ్వు వస్తుంటుంది. లంబు జంబుల మాదిరిగా హీరో పక్కన ఇద్దరు తయారై వేసే పంచ్ లు, జోక్ లు వింటుంటే, బి సి సెంటర్ల ఆడియన్స్ మీద ఎంతో నమ్మకంతో ఈ సినిమా తయారుచేసుకున్నారు అనిపిస్తుంది. కానీ బి సి సెంటర్ ఆడియన్స్ అయినా సినిమా బ్రాండ్ బాగుంటేనే చూస్తారన్న సంగతి మరిచిపోయారు.
తొలిసగం సినిమా నే బోలెడంత లెంగ్త్ వున్నట్లు అనిపిస్తుంది. సినిమా అంతా బ్రాండ్..బ్రాండ్ అని వినిపిస్తూ వుంటే బేండ్ వాయిస్తున్నట్లు అనిపిస్తుంది. గతంలో భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల్లో కేవలం వాళ్ల చర్యల ద్వారా వాళ్ల సమస్య తెలుస్తుంది. అందులోంచి ఫన్ పుడుతుంది. కానీ ఇక్కడ పదే పదే బ్యాండ్ వాయించినట్లు బ్రాండ్..బ్రాండ్ అంటూ వుంటారు. కానీ అందులో ఫన్ రాలదు. అదే అసలు సమస్య. పైగా హీరోయిన్ ఈషా పూర్ గర్ల్ అయితే అయి వుండొచ్చు. కానీ అలా మొఖానికి ఆముదం రాసుకున్నట్లు వుండక్కరలేదు కదా? హీరోయిన్ అలా డిల్ల మొహం వేసుకుని వుంటే సినిమా ఏం చూడబుద్ది అవుతుంది.
దీనికి తోడు బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ఒకటి. అర్థం పర్థం వుండదు. వాయించేస్తూ వుంటాడు. అక్కడ సీన్ ఏమిటి? డైలాగులు ఏమిటి? అన్నిది వదిలేసి, బ్యాక్ గ్రవుండ్ స్కొర్ ఓవర్ లాప్ అయిపోతూ వుంటుంది. హీరో, అమ్మ, నాన్నల పెళ్లి పాట వుంటుంది చూసుకోండి..నా సామి రంగా..కితకితలు పెట్టడానికి పక్కన ఇంకొకళ్లు వుండాల్సిందే. ఇలా ఎంతని చెప్పుకోవాలి ఈ బ్రాండ్ బాబు సినిమా గురించి?
ఇలాంటి సినిమాలో హీరో సుమంత్ శైలేంద్ర బాగానే చేసాడు ఎక్కడా తడబాటు లేదు. ఈషా కూడా సరే. మురళీ శర్మే అసలు పాత్ర అంతా. నవరసాలు వొలికించేసాడు. మిగిలిన వాళ్లంతా పావలా? అర్థ రూపాయి బాపతే.
మారుతి తన బ్రాండ్ ఇమేజ్ ను పది కాలాలు కాపాడాలనుకుంటే, ఇలాంటి సినిమాలకు కథలు, కాకరకాయలు ఇవ్వడం మానేయాలి. అయినా నిర్మాతలు, దర్శకుడు ఓ చిన్న లాజిక్ మిస్సయ్యారు. మారుతి దగ్గర వున్న కథ అమోఘం, అద్భుతం అయి వుంటే, చిన్న హీరోకి, వేరే చిన్న డైరక్టర్ కు ఎందుకు ఇస్తాడు? తానే మాంచి హీరోతో మాంచి సినిమా తీసి క్రెడిట్ తెచ్చుకుంటాడు కానీ. ఇలా ఇచ్చేస్తే వచ్చేది కోటి, కోటిన్నర. అదే తనే పెద్ద హీరోతో చేస్తే వచ్చేది అయిదు కోట్లు. ఈ విధంగా ఆలోచించి వుంటే నిర్మాతలు ఈ సినిమా తీయరు. డైరక్టర్ ఈ పని మానేసి వుండేవాడు.
ఫైనల్ జడ్జిమెంట్..ఈ సినిమా చూస్తుంటే..అత్తారింటికి దారేది, సీమటపాకాయ్, నువ్వు నేను, ఇంకా అనేక సినిమాలు గుర్తుకు వచ్చును. అలా అని వాటి ఒరిజినల్ బ్రాండ్ కాదు. డూప్లికేట్.
ఫినిషింగ్ టచ్….బేండ్ బాబు
తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5
ఆర్ మార్తాండ శర్మ