మారుతి కాన్సెప్టులు భలే గమ్మత్తుగా ఉంటాయి. మతిమరుపు క్యారెక్టర్ని పట్టుకుని ‘భలే భలే మగాడివోయ్’ తీశాడు. అతి శుభ్రత పాయింటుతో ‘మహానుభావుడు’ తెరకెక్కించాడు. ఇప్పుడు బ్రాండ్ బాబు అంటూ మరో కొత్త కథ చెప్పబోతున్నాడు. మారుతి కథ అందించిన సినిమా ఇది. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ జంటగా నటించారు. ప్రభాకర్ దర్శకుడు. టీజర్ ఈరోజు విడుదలైంది. టైటిల్ని బట్టి అర్థమైపోతోంది.. బ్రాండ్ పిచ్చి గల కుర్రాడి కథ ఇదని. తాగే నీటి నుంచి, పోసే… కమోడ్ వరకూ అన్నీ బ్రాండ్లేకావాలి. బెంజ్ కారులా ఖరీదైన ఇంటి నుంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ… పేదింటి పిల్ల మాయలో పడిపోతాడు. వాళ్లిద్దరి ప్రేమకథ ఎలా సాగిందో తెలియాలంటే.. ఈ సినిమా చూడాల్సిందే. టైటిల్లో, టీజర్లో కామెడీ కనిపిస్తోంది. టైమ్ పాస్ చేయించగల పాయింట్ ఉంది. సరిగ్గా తీస్తే… మరో మంచి సినిమా అయ్యే ఛాన్సుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే కనిపిస్తున్నాయి. మారుతి బ్రాండ్ కూడా తోడైంది కాబట్టి.. సినిమాకి బిజినెస్కూడా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.