విశాఖలో జీవీఎల్ నరసింహారావు దందా ఆగడం లేదు. జీవీఎల్ పేరును ప్రమోట్ చేసుకునేందుకు కేంద్ర సంస్థల సీఎస్సాఆర్ నిధులతో.. సంక్రాంతి సంబరాలు నిర్వహించిన ఆయన ఇప్పుడు మరో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జీవీఎల్ కలర్స్ రన్ పేరుతో మరోసారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటికి కూడా కేంద్ర సంస్థలే స్పాన్సర్ షిప్ ఇస్తున్నాయి. జీవీఎల్ వ్యవహారం చూసి.. విశాఖ బీజేపీ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు.
విశాఖలో పోటీకి జీవీఎల్ ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన స్వస్థలం కాదు. కానీ పొత్తు ఉంటుందన్న ఆశతో ఆయన ముందే కర్చీఫ్ వేసుకుంటున్నారు. నిజానికి అది పురందేశ్వరి పోటీ చేయాలనుకునే సీటు. గతంలో ఆమె అక్కడ్నుంచి రెండు సార్లు గెలిచారు కూడా. కానీ జీవీఎల్ మాత్రం .. ముందే కర్చీఫ్ వేసుకుని ఎంపీ హోదాను దుర్వినియోగం చేస్తూ.. కేంద్ర సంస్థల ఉన్నతాధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా సమీక్షలు నిర్వహించి.. సీఎస్సార్ నిధులను మళ్లించుకుంటున్నారు.
ఆ డబ్బులతో సంబరాలు చేస్తూ తన పేరును ప్రచారంలోకి తెచ్చుకుంటున్నారు. జీవీఎల్ వ్యవహారశైలిపై సొంత బీజేపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. నిజానికి విశాఖ బీజేపీలో 90 శాతం మంది ఆయన వెనుక ఉండరు. ఆయన వచ్చి పెత్తనం చేయడంపై ఆగ్రహంతోనే ఉన్నారు. అయినా జీవీఎల్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. కేంద్రం సంస్థల సీఎస్సార్ నిధులతో తన రాజకీయం చేస్తున్నారు.