అంతర్జాతీయ స్థాయిలో నవ్యాంధ్ర ఇమేజ్ పెంచుతున్నామంటూ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటనలు చేస్తుంటారు. ఆ మధ్య దావోస్ పర్యటనకు వెళ్లొచ్చాక కూడా ఇదే చెప్పారు. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సు సందర్భంగానూ ఇదే అన్నారు. నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో కూడా ఆంధ్రా ఇమేజ్ పై ఎలాంటి అనుమానాలూ లేవు. అయితే, తాజాగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో.. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పై టీడీపీలో అంతర్మథనం మొదలైనట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది..!
బాబు వస్తే జాబు వస్తుంది.. ఇది ఎన్నికల ముందు తెలుగుదేశం నినాదం. కొత్తగా ఉద్యోగాల కల్పన అనేది అభూతకల్పనగానే మిగిలిపోయిందన్నది వాస్తవం. కానీ, ఇప్పుడు పరిస్థితి మరోలా పరిణమిస్తోంది. ఏపీలో పేరున్న సంస్థలు వరుసగా మూతపడుతున్నాయి. మొన్నటికి మొన్న.. ఎయిర్ కోస్టా సంస్థ సర్వీసులు నిలిపేసింది. నిన్నటికి నిన్న… అతిపెద్ద ట్రావెల్స్ సంస్థల్లో ఒకటైన కేశినేని సంస్థ మూతపడింది. వీటిపై ఆధారపడ్డ ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నది వాస్తవం. పైగా, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే కేశినేని ట్రావెల్స్ మూతపడటం విశేషం. కేశినేని ట్రావెల్స్ విషయం కాసేపు పక్కన పెడితే.. ఎయిర్ కోస్టా మూసివేతతో టీడీపీ వర్గాలు మరింత ఆందోళన వ్యక్తమౌతోంది.
ఎల్.ఇ.పి.ఎల్. గ్రూప్ ఏపీ సర్కారుతో పలు ఎమ్.ఓ.యు.లు చేసుకున్న సంగతి తెలిసిందే. మలేషియాకు చెందిన ఇసోమెరిక్ హోల్డింగ్స్ అనే సంస్థతోనూ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. కృష్ణపట్నం వద్ద దాదాపు రూ. 3 వేల కోట్లతో ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈ ప్రాజెక్టు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. కారణం ఏంటంటే.. మూతపడ్డ ఎయిర్ కోస్టా కూడా ఎల్.ఇ.పి.ఎల్. సంస్థ ప్రమోటర్లదే కావడం! విజయవాడ కేంద్రంగా ఎయిర్ కోస్టా విమాన సర్వీసులు నడిపింది వీళ్లే. అయితే, ఇప్పుడీ సంస్థ మూతపడ్డట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
అంతేకాదు… ఇన్వెస్టర్ సమిట్ సందర్భంగా కొన్ని ఎరువుల ప్రాజెక్టులు, విద్యుత్ తోపాటు పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ఈ సంస్థ విడివిడిగా ఒప్పందాలు చేసుకుంది. ఎయిర్ కోస్టా మూసివేత తరువాత.. ఆ ప్రమోటర్స్ కుదుర్చుకున్న ఎమ్.ఒ.యు.లు కూడా అటకెక్కినట్టే అనే అభిప్రాయం ప్రస్తుతానికి వ్యక్తమౌతోంది. ఓవరాల్ గా ఇది ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే పరిణామంగా మారుతుందని టీడీపీ ఆందోళన చెందుతోంది. ఎందుకంటే, రాజధాని ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ దినదిన ప్రవర్థమానం కావాలి. అప్పుడే వివిధ సంస్థలు పెట్టుబడులతో ముందుకొచ్చేందుకు ఉత్సాహం చూపిస్తాయి. కానీ, ఎయిర్ కోస్టా, కేశినేని సంస్థలు వంటివి వరుసగా మూతపడుతూ ఉంటే అది బ్రాండ్ ఇమేజ్ కి దెబ్బే అనడంలో ఎలాంటి సందేహం లేదు. టీడీపీ వర్గాల ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు.