చైనా , ఇరాన్ , రష్యా, మయన్మార్ దేశాల్లో ఎక్స్ పై నిషేధం ఉండగా.. తాజాగా బ్రెజిల్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. ఎక్స్ సేవలపై నిషేధం విధిస్తూ బ్రెజిల్ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
బ్రెజిల్ లో ఎక్స్ సంస్థ తరఫున ఓ ప్రతినిధిని నియమించాలని బ్రెజిల్ ప్రభుత్వ ఉత్తర్వులను ఎక్స్ పాటించకపోవడంతో…ఇక నుంచి దేశంలో ఎక్స్ సేవలను నిలిపివేస్తున్నట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎక్స్ సేవలను పూర్తిస్థాయిలో నిషేధించడానికి ఇంటర్నెట్ సర్వీసులకు ఐదు రోజుల గడువు విధించింది. ఎక్స్ సంస్థ తమ ఆదేశాలు పాటించే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
బ్రెజిల్ లో 80లక్షల మంది ఎక్స్ ను యూజ్ చేస్తున్నారు. అయితే , ఆ దేశంలో ఎక్స్ సేవలు అందుబాటులోకి వచ్చినా ఇప్పటివరకు ఎక్స్ తరఫున ప్రతినిధిని నియమించలేదు. దీంతో ఎక్స్ లో తలెత్తే న్యాయవివాదాలను పరిష్కరించేందుకు లీగల్ రిప్రజెంటేటివ్ ను నియమించాలని బ్రెజిల్ సుప్రీంకోర్టు ఎక్స్ కు సూచించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలను ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బ్రెజిల్ లో ఎక్స్ సేవలను నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.