శ్రీవారి బ్రేక్ దర్శన టిక్కెట్లను.. రూ. పదివేలకు అమ్మకానికి పెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మేరకు తొలి పాలక మండలి భేటీలో నిర్ణయం కూడా తీసుకున్నారు. జంబో బోర్డు తొలి భేటీలో 190కిపైగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ బయటకు వెల్లడించలేదు. కానీ ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. కొద్ది రోజుల క్రితం.. వీఐపీ బ్రేక్ దర్శన వ్యవస్థను రద్దు చేసేసిన .. టీటీడీ… సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది. కానీ అది మూన్నాళ్ల ముచ్చటే. ఆ తర్వాత సెల్లార్ దర్శన వ్యవస్థ తరహాలో.. కొత్తగా.. కొంత మందికి దర్శనాలు చేయించేస్తున్నారు. తొలి పాలక మండలి భేటీలో ఈ బ్రేక్ దర్శన టిక్కెట్లను రూ. పదివేలకు విలువ కట్టారు. అయితే.. విమర్శలు వస్తాయి కాబట్టి.. ఆ టిక్కెట్ విలువ రూ. పదివేలను.. విరాళంగా ప్రకటించేలా…ప్రణాళిక సిద్ధం చేశారు.
శ్రీవాణి పేరుతో.. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్… టీటీడీకి ఉంది. ఈ ట్రస్ట్‌కు.. రూ. పది వేల విరాళం ఇస్తే బ్రేక్ దర్శన టిక్కెట్‌ను కేటాయిస్తారు. ఎంత మంది దర్శనం చేసుకోవాలంటే.. అంత మంది … రూ. పదివేల చొప్పున విరాళం ఇవ్వాలి. అంతే కాదు.. టిక్కెట్‌కు కూడా.. రూ. ఐదు వందలు ఎక్స్ట్రా కట్టాలి. అంటే.. రూ. పది వేలు విరాళం ప్లస్ రూ. ఐదు వందలు వీఐపీ టిక్కెట్ ధర. ఒక్కో భక్తుడు.. ఐదు టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ లెక్కల శ్రీవాణి ట్రస్టుకు.. ఏడాదికి రూ. 400 కోట్ల వరకూ… విరాళాలు అందుతాయని భావిస్తున్నారు.
బ్రేక్ దర్శనం అంటే.. ఇప్పటి వరకూ.. వీఐపీలు, రాజకీయ నేతల సిఫార్సులకే ఎక్కువ ప్రాధాన్యం దొరికేది. ఇప్పుడు టీటీడీ బోర్డు కూడా.. భారీగా ఉంది. అందులో ఉన్న సభ్యులు.. తమకు ప్రాధాన్యం ఇచ్చి.. దర్శనం టిక్కెట్లు కేటాయించకపోతే.. ఊరుకోరు. నేరుగా ముఖ్యమంత్రిపైనే.. ఒత్తిడి తెచ్చి బోర్డు సభ్యులుగా పదవులు తెచ్చుకున్న వారే ఎక్కువ. ఇలాంటి సమయంలో… సాధారణ భక్తులకు బ్రేక్ దర్శన టిక్కెట్లు పొందడం గగనమే. కొన్ని రాజకీయ నేతలు.. మరికొన్ని.. బోర్డు సభ్యులకు పోతే.. మిగిలినవి.. ధనవంతుల ఖాతాల్లోకి వెళ్తాయి. అంటే.. ఇక సామాన్యభక్తుడికి బ్రేక్ దర్శనం అవకాశం లేనట్లే..!