హైడ్రా కూల్చివేతల్ని పేదల పేరుతో అడ్డుకోవడంలో కొంత మంది సక్సెస్ అయ్యారు. హైడ్రా యాక్షన్ ప్రారంభించినప్పటి నుండి కొంత మందికి ఉక్కపోత ప్రారంభమయింది. అదే అదనుగా పేదల ఇళ్లు ఇంటూ ఆరోపణలు ప్రారంభించారు. చివరికి ఈ కారణంగా కొత్తగా చేస్తున్న ఆక్రమణలనే తొలగిస్తున్నామని పాత వాటి జోలికి పోవడం లేదని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
పేదలు చెరువుల్ని ఆక్రమిస్తారా ?
మన దేశంలో పేదలు చెరువుల్లో కాసేపు సేదరీరడానికి కూడా రుసుములు కట్టాల్సి ఉంటుంది. అలాంటిది ప్రజలు చెరువుల్ని ఆక్రమించడం అనేది అసాధ్యమన విషయం. మరి చెరువుల సమీపంలో నివసిస్తున్న వారిలో పేదలు లేరా అంటే ఉన్నారు.. కానీ కబ్జాలు చేసింది మాత్రం వారు కాదు. పలుకుడి ఉన్నవారు.. అవినీతికి పాల్పడిన వారు. వారు కబ్జాలు చేసి.. మాయ మాటలు చెప్పి పేదలకు అమ్మేశారు. ఇప్పుడా పేదలే బలి పశువులు అవుతున్నారు.
అసలు కబ్జాలు చేసి అమ్మేసిన వాళ్లనే శిక్షించాలి
చెరువుల్ని కబ్జా చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారులు. రాజకీయ నేతల అవతారం ఎత్తిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు … వాళ్లతో చేతులు కలిపిన వారు ఇలా చెరువుల్ని చెరబట్టి ప్లాట్లుగా చేసి అమ్మేసుకున్నారు. ఇప్పుడు హైడ్రా… ఆ ఇళ్లను కూల్చి వేయడం కన్నా ముందు వారికి పరిహారం ఇప్పించాలి. అమ్ముకున్న వారి దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేసి వారి డబ్బులు వారికి ఇప్పించి .. కూల్చివేతేలు చేపట్టాల్సి ఉంది.
పాత నివాసాల పేరుతో క్లియరెన్స్ ఇచ్చేస్తే ప్రయోజనం ఉండదు !
కొత్తగా చేస్తున్న ఆక్రమణల్ని మాత్రమే కూల్చేస్తామని…. మిగతా వాటిని పట్టించుకోబోమని అంటే హైడ్రా లక్ష్యం పూర్తిగా నీరు గారిపోయినట్లే. ఓవైసీ కాలేజీలు.. నోటీసులు ఇచ్చిన రేవంత్రెడ్డి సోదరుడు ఇల్లు.. జన్వాడ ఫామ్ హౌస్ సహా దేనికీ ముప్పు లేనట్లే. హైడ్రా… ప్రచార ఆర్భాటంగా మిగిలిపోతుంది.