తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడింది. పదవుల కోసం పార్టీలో పోటీ ఎక్కువ ఉండటం, కాంగ్రెస్ పెద్దలు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బిజీగా ఉండటంతో ఈ విషయంపై మరోసారి చర్చించాలని భావించినట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి ఆషాడమాసం ప్రారంభం కానుండటం.. ఇప్పట్లో మంచి రోజులు లేకపోవడంతో వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కొత్త ప్రెసిడెంట్ ఎంపిక ఉండే అవకాశం కనిపిస్తోంది.
గురువారమే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని లీకులు వచ్చాయి. సీఎం రేవంత్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు హుటాహుటిన ఢిల్లీ వెళ్ళడంతో గురువారమే ఇందుకు ముహూర్తంగా పార్టీ శ్రేణులు భావించాయి. మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న ఆశవాహులు కూడా ఢిల్లీ స్థాయిలో చివరి వరకు లాబీయింగ్ కొనసాగించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అపాయింట్ మెంట్ కోసం నిరీక్షించారు.
అదే సమయంలో పీసీసీ పదవి కోసం పలువురు నేతలు తీవ్రమైన పోటీ నెలకొంది. పీసీసీ అధ్యక్ష పదవి ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతల్లో ఒకరికి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీంతో ఎస్సీల నుంచి అడ్లూరి లక్ష్మణ్ , ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయక్, బీసీల నుంచి మధుయాష్కీ, మహేష్ కుమార్ గౌడ్ లు పోటీపడుతున్నారు. దీంతో ప్రతి పెద్దలు జాతీయ స్థాయి అంశాలపై బిజీగా ఉన్నందున ఈ పదవుల భర్తీపై మరోసారి చర్చించాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.
దీంతో కొద్ది రోజులుగా తెలంగాణలో పదవుల భర్తీపై ఢిల్లీలో నెలకొన్న హడావిడి ఎటు తేలకుండానే ముగిసినట్లు అయింది.