బ్రిక్స్ సదస్సులో పాకిస్తాన్ ను టార్గెట్ చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ సఫలమయ్యారు. గోవా డిక్లరేషన్ లో ఉగ్రవాదాన్ని ప్రధానాంశంగా మలిచారు. ఐదు దేశాల అధినేతల ఏకగ్రీవ ఆమోదంతో డిక్లరేషన్ ను ప్రకటించారు. అంటే, పరోక్షంగా చైనా కూడా పాకిస్తాన్ వంటి ఉగ్రవాద దేశాలను హెచ్చరించడంలో గొంతు కలిపినట్టే.
గోవా సదస్సులో మోడీ వ్యూహచతురత స్పష్టంగా కనిపించింది. మొన్నటి వరకూ పాకిస్తాన్ కు చేరువవుతుందని కొందరు భావించిన రష్యా, భారత్ కు పూర్తి మద్దతు ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరులో మోడీప్రభుత్వానికి అండగా ఉంటామని పుతిన్ ప్రకటించారు. గోవాలో శనివారం నాడు ఇదే ముఖ్యాంశం. 39 వేల కోట్ల రూపాయల డిఫెన్స్ డీల్ మరో ముఖ్యాంశం. పాత మిత్రదేశం మనకు ఎప్పటికీ ఆప్త దేశమేనని గోవా వేదిక ద్వారా లోకానికి చాటారు మోడీ, పుతిన్.
పుతిన్ తో భేటీ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మోడీ చర్చలు జరిపారు. ఉగ్రవాదం, ఎన్ ఎస్ జి సభ్యత్వం, భారత్ లో పెట్టుబడులు, చైనా సరుకులకు భారత మార్కెట్ అవసరం తదితర విషయాలను చర్చించారు. భారత్ కు ఎన్ ఎస్ జి సభ్యత్వంపై చైనా పూర్తిగా తెగేదాకా లాగలేదు. ఇంకోసారి చర్చించడానికి సిద్ధమని తెలిపింది. పాక్ మిత్రదేశమైన చైనా, ఉగ్రవాదం విషయంలో కలిసి వచ్చేలా చేయడంలో మోడీ వ్యూహ చతురత స్పష్టమైంది. బంగారు బాతుగుడ్డు లాంటి భారతీయ మార్కెట్ ను వదులుకోవడానికి చైనా ఇష్టపడదని మోడీకి తెలుసు. బహుశా ఈ పాయింట్ మీదే డ్రాగన్ ను ఎంతో కొంత దారికి తెచ్చి ఉంటారు.
ఆదివారం బ్రిక్స్ సదస్సు ముగింపు సందర్భంగా విడుదల చేసిన గోవా డిక్లరేషన్ లో పాకిస్తాన్ అనే పదం లేదుగానీ, ప్రతి అక్షరం ఆ దేశాన్ని ఉద్దేశించిందే. పాక్ చేస్తున్న పాపిష్టి పనుల వివరాలన్నీ అందులో ఉన్నాయి. ఆ పాపిష్టి పనులు చేస్తున్న దేశాల పనిపట్టాలని డిక్లరేషన్ లో ఏకాభిప్రాయం వెల్లడించారు. దీనికి చైనా అభ్యంతరం చెప్పలేదు. అంటే పరోక్షంగా పాకిస్తాన్ కు హెచ్చరిక చేసిందని భావించవచ్చు. అంతమాత్రాన పాక్ తో చైనా సంబంధాలు క్షీణిస్తాయని కాదు. అయితే, భారత్ అంతర్జాతీయంగా తనను ఏ విధంగా ఏకాకిని చేసిందో పాక్ కు అర్థమైంది. ఒకప్పుడు గుడ్డిగా తనను సమర్థించిన అమెరికాను ఇప్పుడు చాలా వరకు దూరం చేసింది భారత్. చైనాను కూడా అలాగే చేస్తుందేమో అనే భయం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఆ భయం ఇప్పుడు మొదలైంది.