భద్రం. తెలుగు తెర పై ఇటీవల మెల్ల మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తున్న కొత్త కమెడియన్ భద్రం. నిన్న విడుదలైన శర్వానంద్, మారుతి ల మహానుభావుడు లో నవ్వులు పూయించిన భద్రం అసలు సినిమాల్లోకి ఎలా వచ్చాడో తెలిస్తే కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది.
చిన్న షార్ట్ ఫిలింస్ చేసి వాటిని సోషల్ మీడియా లో షేర్ చేయడం ఈయనకి హాబీ. కానీ అసలు వృత్తి మాత్రం ఎర్గోనొమీ డాక్టర్. మామూలుగా ఫిజియోథెరపీ లో స్పోర్ట్స్ కి సంబంధించి ఎలా స్పెషలిస్ట్స్ ఉంటారో అలాగే, సాఫ్ట్ వేర్ తరహా ఫిజికల్ యాక్టివిటీస్ లేని వారికి సంబంధించిన స్పెషలైజేషన్ ఇది. అలా జాబ్ చేసుకుంటూ, సరదాకి సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన “పెళ్ళంటే జర భద్రం” అనే 7 నిముషాల మోనొలాగ్ లాంటి షార్ట్ ఫిలిం చూసిన పూరీ జగన్నాధ్, ఆ వీడియో కింద..”ఎక్సలెంట్, చాలా బాగా చేసావు, నీలాంటి కొత్త టాలెంట్ కోసమే నేను ఎదురు చూస్తున్నాను..” అని పోస్ట్ చేయడం తో ఒక్కసారి మొత్తం ఇండస్ట్రీ దృష్టి లో పడ్డాడు భద్రం. అంతకు ముందు ఒకట్రెండు సినిమాల్లో మరీ చిన్న పాత్రలు చేసినా వాటికి గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాత పూరీ దర్శకత్వం లో వచ్చిన జ్యోతి లక్ష్మి, లోఫర్ లాంటి సినిమాలు, మారుతి దర్శకత్వం లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమాలు కాస్త మంచి గుర్తింపే తెచ్చాయి. ఇక నిన్న విడుదలైన మహానుభావుడు లో పాత్ర మంచి బ్రేక్ ఇచ్చింది భద్రం కి.
కొసమెరుపు: బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు కి స్వయానా అల్లుడయినా ఇండస్ట్రీ లో ఎవరికీ ఆ విషయం చెప్పకుండా, స్వంత ప్రతిభ తో అవకాశాలు తెచ్చుకుంటూ, చిన్న చిన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడకుండా, కొద్ది కొద్దిగా తన పాత్రల నిడివి ని పెంచుకుంటూ వెళ్తున్న భద్రం కి మంచి భవిష్యత్తే ఉండేట్టు కనిపిస్తోంది టాలీవుడ్ లో.