ఈరోజు మీడియాలో ఓటుకి నోటు కేసు గురించి ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. దానిపై తెలంగాణా ఎసిబి ఈనెల మొదటి వారంలోనే సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేసిందని ఆ వార్తలో పేర్కొంది. ఆ కేసులో నాలుగవ నిందితుడుగా ఉన్న జెరూసలేం మత్తయ్య కొన్ని రోజుల క్రితం హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ కేసుతో తనకి ఏవిధంగాను సంబంధం లేకపోయిన రాజకీయ కారణాలతోనే తెలంగాణా ఎసిబి తనని అందులో ఇరికించిందని, కనుక తనకి ఆ కేసు నుంచి విముక్తి ప్రసాదించవలసిందిగా ఆ పిటిషన్ ద్వారా హైకోర్టుని అభ్యర్ధించారు. హైకోర్టు దానిపై సానుకూలంగా స్పందించి ఆయనపై ఎసిబి పెట్టిన కేసుని కొట్టి వేసింది.
రాజకీయ కారణాలతో ఆ కేసుని తెలంగాణా ఎసిబి త్రొక్కిపట్టి ఉంచినప్పటికీ, ఆ కేసు నుంచి మత్తయ్యకి హైకోర్టు విముక్తి కల్పించడంతో అప్రమత్తం అయ్యింది. మత్తయ్యకి విముక్తి కల్పించినట్లే ఆ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మిగిలిన వారికి కూడా విముక్తి కల్పిస్తే, ఎంతో పకడ్బందీగా తయారుచేసిన ఆ కేసు నీరుకారిపోతుందనే ఉద్దేశ్యంతో మత్తయ్యకి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ జూలై మొదటి వారంలోనే సుప్రీం కోర్టులో తెలంగాణా ఎసిబి ఒక పిటిషన్ వేసినట్లు వార్త వచ్చింది. ఒకవేళ అదే నిజమైతే తెరాస ప్రభుత్వం తన భవిష్య అవసరాల కోసం ఆ కేసుని సజీవంగా ఉంచాలనుకొన్నట్లు భావించవచ్చు. ఓటుకి నోటు కేసుపై సుప్రీం కోర్టులో విచారణ జరిగితే మళ్ళీ దాని గురించి చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కనుక తెదేపా ప్రతిష్ట మసకబారవచ్చు.