‘ఇస్లాంకి అసలు సమస్య అదే’ అనే శీర్షికతో ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా వ్రాసిన ఒక ఆర్టికల్ సాక్షి మీడియాలో శనివారం ప్రచురింపబడింది. విద్యాధికులైన ముస్లిం యువత ఉగ్రవాదం వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారు? అనే అంశంపై దానిలో చక్కగా వివరించారు రచయిత. దాని ఆధారంగానే ఈ ఆర్టికల్ వ్రాయబడింది.
బంగ్లాదేశ్ లో దాడులకి పాల్పడిన ఉగ్రవాదులు భారతీయుడైన ఇస్లాం మత భోదకుడు జకీర్ నాయక్ ప్రసంగాలతో ప్రేరణ పొందారని తెలిసినప్పటి నుంచి, ఆయనకి సంబంధించిన అన్ని విషయాలపై మీడియాలో చర్చ జరుగుతోంది. అలాగే ఎన్.ఐ.ఏ. అరెస్ట్ చేసిన ఉగ్రవాదులకి న్యాయసహాయం చేస్తానన్న మజ్లీస్ పార్టీ అసదుద్దీన్ ఓవైసీపై కూడా ప్రస్తుతం మీడియాలో చర్చ జరుగుతోంది. జకీర్ నాయక్ ప్రసంగాలు, మత భోధనలు, రచనలు తదితర విషయాలపై కేంద్రప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా ఆరా తీస్తోంది. ఆయన కదలికలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలని శేఖర్ గుప్తా తనదైన శైలిలో చాలా చక్కగా వివరించారు. సాధారణంగా సామాన్యులు తమ మతం గురించి తెలుసుకొనేందుకు మత గురువుల భోధనలని వింటారు. గుళ్ళు, మశీదులు, చర్చిలు, గురుద్వారాలకి వెళ్లి తమ మతాచారాల ప్రకారం భగవంతుని పూజిస్తారు. ఇప్పుడు వివిద మతాల కోసం ప్రత్యేకంగా టీవీ చాన్నాళ్ళు కూడా వచ్చేశాయి కనుక వాటి ద్వారా కూడా మతభోధకులు చెప్పే ప్రవచనాలని ప్రజలు వింటున్నారు.
అయితే ఉన్నత విద్యావంతులైన ముస్లిం యువతలో మతం పట్ల ఆసక్తి కలిగినవారు ఈ మాధ్యమాల ద్వారా కాకుండా, ఇంటర్నెట్ ని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఇంటర్నెట్, ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ ఏదయినా సరే సక్రమంగా ఉపయోగించుకొంటే దాని వలన చాలా లాభం, విజ్ఞానం పొందవచ్చు. కానీ వాటిలో దారి తప్పితే జీవితాలు కూడా దారి తప్పిపోతుంటాయి…చివరికి అది చుట్టూ ఉండే సమాజ వినాశనానికి కూడా దారి తీస్తుందని ఐసిస్ ఉగ్రవాదం కళ్ళకి కట్టినట్లు చూపిస్తోంది.
ఇస్లాం మతం గురించి తెలుసుకోవాలనే ఉన్నత విద్యావంతులు గూగుల్ ని ఆశ్రయించినప్పుడు వారికి జకీర్ నాయక్, మొహమ్మద్ హఫీజ్ సయీద్ వంటివారి భోధనలు కనబడుతుంటాయి. తమ అత్యద్భుతమైన వాక్పటిమతో ఎవరినైనా సరే ఇట్టే ఆకట్టుకొని చాలా ప్రభావితంగా చేయగల అటువంటి వారు ఇస్లాం మతం గురించి తెలుసుకోవాలనుకొన్న యువకులకి ఆ మతం గొప్పదనం గురించి చెప్పేబదులు, అది ప్రమాదంలో ఉందని దానిని రక్షించుకోవలసిన అవసరం, బాధ్యత మీమీదే ఉందని అందుకు ‘జిహాద్’ మాత్రమే సరైన మార్గమని భోదించడంతో, వారి ప్రభావానికి లొంగిపోతున్న యువత ఇస్లాం మార్గంలో పయనించే బదులు ఉగ్రవాద మార్గంలోకి వెళిపోతున్నారు.
జకీర్ నాయక్ ముస్లిం యువతని ఉగ్రవాదం వైపు వెళ్ళమని ప్రోత్సహించరు. పైగా దానిని ఖండిస్తుంటారు కూడా. కానీ ఆయన మత భోధనలు చివరికి వారిని ఉగ్రవాదంవైపే మళ్ళిస్తాయని బంగ్లాదేశ్ లో జరిగిన దాడులు నిరూపించాయి.
అసదుద్దీన్ ఓవైసీ కూడా ఐసిస్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు గొప్పగా చెప్పుకొంటారు. ఆ విషయం చాటుకొనేందుకు పాతబస్తీలో హోర్డింగులు కూడా పెడుతుంటారు. ఐసిస్ ఉగ్రవాదులని భౌతికంగానే కాకుండా వారి భావజాలాన్ని కూడా పూర్తిగా తుడిచిపెడితే కానీ ఈ ఉగ్రవాద సమస్య పరిష్కారం కాదని చాలా చక్కటి సలహా చెపుతుంటారు. కానీ అదే సమయంలో హైదరాబాద్ లో ప్రేలుళ్ళకి కుట్ర పన్నుతున్న ఉగ్రవాదులకి న్యాయసహాయం చేస్తానని కూడా చెపుతుంటారు. ఎవరైనా విమర్శిస్తే అందులో తప్పేమీ లేదని వాదించడమే కాకుండా తన మాటకి కట్టుబడి ఉన్నానని గట్టిగా చెపుతుంటారు.
యువతని మంచి మార్గంలో నడిపించవలసిన పెద్దలు, మతభోధకులు, ప్రముఖులు ఈవిధమైన ద్వందవైఖరితో మాట్లాడుతుండటం వలననే ఒక మంచి ఉద్దేశ్యంతో వారిని ఆశ్రయిస్తున్న యువత తప్పుడు మార్గంలోకి వెళ్లిపోతున్నట్లు స్పష్టం అవుతోంది.