ఉగాది పండుగ అనగానే తెలుగువాళ్ళకి ఉగాది పచ్చడి..రాజకీయ నేతలకి పంచాంగ శ్రవణం గుర్తుకువస్తాయి. ప్రజలకి ఉగాది పచ్చడి అంటే ఎంత మక్కువో, రాజకీయ నేతలకి తామే అధికారంలోకి రాబోతున్నట్లుగా చెప్పించుకోవడం అంటే అంత మక్కువ. అది గ్రహించబట్టే రాజకీయ పంచాంగకర్తలు కూడా పుట్టుకొచ్చారు. ఏ రాజకీయ పార్టీ వాళ్ళు పిలిచినా సరే వాళ్ళు ఒకేమాట చాలా నమ్మకంగా చెపుతుంటారు. అదే.. మీకు ఇంకా తిరుగు ఉండదు… వచ్చే ఎన్నికలలో మీ పార్టీయే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది…మీరే ముఖ్యమంత్రి అవుతారని! ఏ రాజకీయ నేతయినా, పార్టీ అయినా కోరుకొనేది అదే కదా! అందుకే వాళ్ళకి అంత డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నిన్న ఉగాది సందర్భంగా అదే జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం నిన్న విజయవాడలో నిర్వహించిన ఉగాది వేడుకలలో పంచాంగ శ్రవణం చేసిన పొన్నలూరి శ్రీనివాస గార్గేయ, చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తారని, రాష్ట్రానికి ఆర్ధిక ఇబ్బందులు పెద్దగా ఉండవని, ఈ ఏడాది వర్షాలు బాగా పడి, పంటలు బాగా పండుతాయని చెప్పారు. ఇంకా జూన్ నుంచి ఓ మూడు నెలలపాటు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉండవచ్చని తెలిపారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటిని అవలీలగా అధిగమించగలరని చెప్పారు. ప్రస్తుతం తెదేపాయే అధికారంలో ఉంది..ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది కనుక ఈసారి వాటి గురించి ప్రస్తావించలేదు. తెదేపా-బీజేపీ పొత్తులు కొనసాగుతాయో లేదో చూసుకొని వచ్చే ఏడాదినాటి పంచాంగ శ్రవణం చేసినప్పుడు తెదేపాయే మళ్ళీ అధికారంలోకి వస్తుందని భరోసా ఇస్తారేమో?
ఇంక క్రీస్టియన్ మతస్తులయిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, చేతిలో ఎప్పుడూ బైబిల్ పట్టుకొని తిరిగే వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా ప్రముఖ సిద్ధాంతి బ్రహ్మశ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రి చెప్పిన పంచాంగ శ్రవణం ముచ్చటగా వినడం, జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఉజ్వలంగా ఉండబోతోందని ఆయన చెపుతుంటే మురిసిపోవడం భలేగా ఉంది.
శాస్త్రిగారు గ్రహగతులను, రాశులను బట్టి పంచాంగం చెప్పారో లేకపోతే (సాక్షి) న్యూస్ పేపర్స్, ఛానల్స్ లోని రాజకీయ విశ్లేషణలని క్షుణ్ణంగా గమనించి జోస్యం చెప్పారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మనసులో ఏమి కోరుకొంటున్నారో అచ్చంగా అలాగే చెప్పారు. ఆయన ఏమి చెప్పారంటే, జగన్ భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుంది. జగన్ నేతృత్వంలో వైకాపా ప్రజలకి నానాటికీ ఇంకా చేరువయిపోతోంది.
గ్రహాలన్నీ (?) జగన్ కి చాలా అనుకూలంగా ఉన్నందున తనకి వ్యతిరేకంగా జరుగుతున్న అన్ని కుట్రలు, కుతంత్రాలను చేదించుకొని బయటపడతారు. జగన్ “సౌత్ ఇండియన్ పొలిటికల్ సూపర్ స్టార్’ అని దేశం గుర్తిస్తుంది. జగన్ తండ్రికి తగ్గ తనయుడు. మంచి పోరాట పటిమ ప్రదర్శిస్తున్నవాడు. మంచి ధైర్యసాహాసాలున్నవాడు. మంచి ప్రజాధారణ ఉన్నవాడు. చాలా వేగంగా ప్రజాధారణ కోల్పోతున్న తెదేపాలోకి వెళుతున్న వైకాపా ఎమ్మెల్యేల భవిష్యత్ శూన్యం కాబోతోంది. రోజా కోసం ఆయన చేస్తున్న పోరాటం అద్వితీయం. ఆ కారణంగా రాష్ట్ర ప్రజలు వైకాపాకి ఇంకా చేరువవుతారు. 2019 ఎన్నికలలో వైకాపాయే విజయం సాధిస్తుంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు.”
చంద్రబాబు నాయుడుకి, తెదేపాకి అంతా మంచే జరుగుతుంది…అని చెప్పిన శర్మగారు వచ్చే ఎన్నికల ఫలితాల గురించి చెప్పలేదు. కానీ, చెప్పి ఉండి ఉంటే తెదేపాయే మళ్ళీ ఖచ్చితంగా గెలిచేదని, మళ్ళీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అయ్యేవారని చెప్పి ఉండేవారు. అని మనమే అర్ధం చేసుకోగలము కనుకనే చెప్పలేదేమో. అలాగే వైకాపాయే వచ్చే ఎన్నికలలో గెలిచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని శాస్త్రిగారు తేల్చి చెప్పేశారు. రెండు పార్టీలు గెలిచి, ఇద్దరికీ ముఖ్యమంత్రులయ్యే అవకాశాలుంటే మరి ఓడిపోయేదెవరు..వారిని ఎన్నుకొన్న ప్రజలేమో?