భారతదేశం నుంచి తరలిపోయిన సంపదను తిరిగి తేవడం విషయంలో కేంద్రం గతంలో కూడా ఎన్నడూ పెద్దగా శ్రద్ధ కనబరచింది లేదు. తీరా ఇప్పుడు కోహినూర్ వజ్రం గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. దేశంలో మరే సమస్యలూ లేనట్లుగా కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడానికి సంబంధించిన చర్చను సాగిస్తున్నారు. మన దేశ ఔద్ధత్యానికి, గొప్పదనానికి ప్రతీకలు అయిన సాంస్కృతిక సంపదను ఎప్పటికీ మనదే అన్నట్లుగా కాపాడుకోవాలని అభిలషించడం మంచిదే.. ఈ విషయంలో వారిని మనం అభినందించాల్సిందే. అయితే ఎంపీలు కోరినంత మాత్రాన కేంద్రం ఈ విషయంలో స్పందిస్తుందనే నమ్మకం మాత్రం జనానికి కలగడం లేదు.
కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్నుంచి భారత్‌కు తిరిగి తెప్పించాలనే అంశం ఇప్పుడు వార్తల్లో అంశంగా నిలుస్తున్నది. చర్చోపచర్చలు దీనిచుట్టూ జరుగుతున్నాయి. సుప్రీం కోర్టులో పిల్ పర్యవసానంగా ఈ చర్చ మొదలైంది. సాధ్యం కాదని, ప్రయత్నిస్తాం అని కేంద్రం సుప్రీంలో అఫిడవిట్లు దాఖలు చేసింది. తాజాగా పార్లమెంటులో ఈ అంశాన్ని చర్చకు తెస్తూ.. కోహినూర్ వజ్రాన్ని తిరిగి తేవాల్సిందేనని ఎంపీ మెహతాబ్ డిమాండ్ చేశారు.
భారతీయ ఆధ్యాత్మిక సౌరభాన్ని కూడా ఆయన ఈ కోహినూర్‌కు కాస్త అద్ది గుబాళింపజేశారు. మహాభారతంలో శ్రీకృష్ణుడి వద్ద ఉన్నట్లుగా చెప్పుకునే అత్యంత మహిమాన్వితమైన శమంతకమణి కూడా ఇదేనని మెహతాబ్ అభివర్ణించడం విశేషం. దీన్ని మనం బ్రిటన్‌కు కానుకగా సమర్పించుకున్నాం గనుక మళ్లీ తేవడం కుదరదని కేంద్రం పేర్కొన్నది. అయితే.. ఇది కానుకగా ఇవ్వబడినది కాదని, సిక్కు రాజు దులీప్‌సింగ్ నుంచి బ్రిటిష్ పాలకులు బలవంతంగా దీన్ని లాక్కుని తమ దేశానికి తీసుకువెళ్లారని మెహతాబ్ చెప్పడం విశేషం.
ఆయన చెప్పిన చారిత్రకవాస్తవాలు బాగానే ఉన్నాయి. కానీ.. కోహినూర్‌ను తిరిగి తీసుకురాగల సత్తా కేంద్రానికి ఉన్నట్లు మాత్రం అనిపించడం లేదు. నమ్మకం కలగడం లేదు. భారతీయ సాంస్కృతిక సంపద అనుకునే వేటినీ తిరిగి స్వదేశానికి తీసుకురావడం గురించి కేంద్ర ప్రభుత్వం పరంగా గతంలో శ్రద్ధ చూపించిన దాఖలాలు లేవు. ఇప్పుడు మాత్రం శ్రద్ధ పెడతారని అనుకోవడం భ్రమే. గతంలో టిప్పు సుల్తాన్ కత్తి, గాంధీ స్మృతులు వంటివి ప్రెవేటు సంస్థల వేలానికి వస్తేనే కేంద్రం పట్టించుకోలేదు. మరి బ్రిటన్ ప్రభుత్వం వద్ద ఉన్న కోహినూర్ తేవడం వారికి సాధ్యమయ్యే పనేనా అని పలువురు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా కేంద్రం చొరవచూపి దాన్ని వెనక్కు తేగలిగితే మాత్రం.. ఒక సాంస్కృతిక విజయంగానే భావించాల్సి ఉంటుంది.