పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి సెగ పుట్టిస్తున్నాయి. ఎన్నికల ఏడాదిలో.. ఈ ధరలు…ఓట్ల వేటలో తీవ్ర ప్రభావం చూపిస్తాయని కూడా తెలుసు. కానీ ఒక్క రూపాయి పన్ను తగ్గిస్తేనే.. రూ. 13వేల కోట్లు నష్టపోతామంటూ దీర్ఘాలు తీస్తున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ… సాహసం చేయడం లేదు. అలాగని.. ఏదో ఒకటి చేయకపోతే.. మళ్లీ ఏడాదికి తను ఆర్థిక మంత్రిగా ఉండరని తెలుసు. అందుకే అప్పుడప్పుడు.. పెట్రోల్, డిజిల్ ధరలను జీఎస్టీలోకి చేర్చే కసరత్తు జరుగుతోందని ప్రకటనలు చేస్తూ.. బిస్కెట్లు వేస్తూంటారు. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి చేరిస్తే కనీసం.. 30 రూపాయలు లీటర్‌కు తగ్గుతుందని ప్రజలు భావిస్తున్నారు. అందుకే జైట్లీ ప్రకటన ఎప్పుడు కార్యరూపంలో వస్తుందోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ నిజానికి అది ఓ జుమ్లా.. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నేతలు ఇచ్చిన జుమ్లాల్లో.. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి చేర్చడం కూడా ఒకటిగా మారింది.
ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వంలోని నిపుణునే నిస్సంకోచంగా బయటకు వెల్లడిస్తున్నారు. అరుణ్ జైట్లీ చెప్పినట్లు పెట్రోల్ , డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి చేర్చడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని సాక్షాత్తూ నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెట్రోల్, డీజిల్‌పై దాదాపు 90శాతం పన్నులు విధిస్తున్నాయని గుర్తు చేశారు. దీనిని జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రప్రభుత్వాలు ఆదాయం కోల్పోతాయని దీనికి అంగీకరించబోరని తేల్చేశారు. అరుణ్ జైట్లీ ముందస్తుగా జీఎస్టీలోకి చేర్చే అంశాన్ని పరిశీలిస్తామన్నందున.. జులై ఒకటిన జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. కానీ రాష్ట్రాలు మాత్రం అంగీకరించే ప్రశ్నే లేదు.
కేంద్రం తాము జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తుల్ని తేవాలనుకున్నా.. రాష్ట్రాలే అడ్డుకున్నాయని… బహుశా జూలై ఒకటో తేదీ తర్వాత ప్రచారం ప్రారంభించవచ్చు. లేదంటే… పెట్రోల్ డీజిల్‌పై పన్నులు ఏ మాత్రం తగ్గకుండా… జీఎస్టీలో చేర్చే అతి తెలివిని ప్రదర్శించవచ్చు. అంటే.. ఇరవై ఎనిమిది శాతం శ్లాబ్ రేట్లోకి పెట్రోల్, డీజిల్‌ను చేర్చి… దానిపై సెస్సులు, టాక్సులు విధించడం. అలా చేస్తే… కేంద్రంపై మరంత వ్యతిరేకత పెరగడం ఖాయం. కేంద్రం ఉద్దేశం మాత్రం.. ఏం చేసినా.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకూడదనే. దాని కోసమే రకరకాల అధ్యయనాలు చేస్తోంది… కానీ తగ్గించడానికి కాదు..!