యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి బ్రిటన్ విడిపోయింది. యూరోపియన్ యూనియన్ లో కొనసాగాలా వద్దా? అనే దానిపై ప్రజాభిప్రాయం కోరుతూ బ్రిటన్ దేశంలో నిర్వహించిన పబ్లిక్ రిఫరెండం (బ్రెగ్జిట్) ఫలితాలు కొద్ది సేపటి క్రితం వెలువడ్డాయి. దానిలో 51.8 శాతం ప్రజలు విడిపోవాలని కోరినట్లు తేలింది. దీనితో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడం ఖాయం అయిపోయింది. ఈ ప్రభావం మొట్ట మోదత బ్రిటన్ దేశ ఆర్ధిక వ్యవస్థపైనే పడింది. అమెరికన్ డాలర్ తో పోలిస్తే బ్రిటన్ పౌండ్ విలువ ఒకేసారి 10 శాతం పడిపోయి, 1985 నాటి కనిష్ట స్థాయికి చేరుకొంది. బ్రెగ్జిట్ ఫలితాలు విడిపోవడానికే బలమైన సంకేతాలు ఇవ్వడం మొదలైనప్పటి నుంచి భారత్ తో సహా ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లపైనా ఆ ప్రభావం కనబడటం మొదలయింది. భారత్ లో స్టాక్ మార్కెట్ బారీ నష్టాలతో సాగుతోంది. యూరోపియన్ యూనియన్ తో సహా వివిధ దేశాలలో స్టాక్ మార్కెట్స్ పరిస్థితి ఇదే. బ్రిటన్ విడిపోవడంతో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ పరిస్థితి ఏవిధంగా ఉండబోతోందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఈ ప్రభావంతో రానున్న రోజులలో మరిన్ని దేశాలు యూనియన్ నుంచి నిష్క్రమించే అవకాశం కూడా ఉంది.