అమరావతి నగరాభివృద్ధికి బ్రిటన్ సహకరిస్తుందంటూ వస్తున్న వార్తల్లో కొంత గందరగోళ పరిస్థితి తలెత్తింది. అమరావతి పేరిట రెండు నగరాలు ఉండటం, మీడియాలో స్పష్టత లేకపోవడం ఈ పరిస్థితికి కారణం.
ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటనలో ఉన్నప్పడు అమరావతికి బ్రిటన్ ఆర్థికసాయం ప్రకటిస్తుందని మీడియాలో వార్త రాగానే అది మహారాష్ట్రలోని అమ్రావతి నగరమా, లేక ఏపీ రాజధాని అమరావతి నగరమా అన్న సందేహం వచ్చింది. ఆ తర్వాత బ్రిటన్ ఆర్థిక సాయం అందించేది ఏపీ రాజధాని అమరావతికేనంటూ స్పష్టత వచ్చింది. కాగా, మూడు నెలల క్రిందటే బ్రిటీష్ దౌత్యాధికారి మెక్ అలెస్టర్ ఏపీ రాజధాని అమరావతి అబివృద్ధికి బ్రిటన్ కంపెనీలు సాయంచేస్తాయని చెప్పారు. అప్పట్లో ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. ఆగస్టు ఆరంభంలో అలెస్టర్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతి పట్ల ఆసక్తి చూపారు. తుళ్లూరు, ఉద్దండరాయని పాలెం ప్రాంతాలకు వెళ్లారు. ఈ ప్రాంతమంతా రాజధానిగా బాగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయి నగరంగా మారే అమరావతి అభివృద్ధిలో బ్రిటన్ కు చెందిన పలు కంపెనీలు, సంస్థలు తమవంతు సహకారం అందిస్తాయని హామీ ఇచ్చారు.
అయితే, ఇప్పుడు తాజాగా వచ్చిన మరో వార్త… భారత్ లో మూడు ఆకర్షణీయ నగరాలను అభివృద్ధిచేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించనట్లు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ (ముంబయి) కుమార్ అయ్యర్ చెప్పారు. వారు చెబుతున్న మూడు నగరాల్లో రెండు మహారాష్ట్రలో ఉన్నాయి. ఒకటి మధ్యప్రదేశ్ లో ఉంది. మహారాష్ట్రాలోని పుణె, అమ్రావతి, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ అభివృద్ధికి బృహత్ ప్రణాళికను రూపొందించి, మౌలిక వసతుల రూపకల్పన, విద్య, ట్రాఫిక్ నియంత్రణ వంటి రంగాల్లో నిధులు వెచ్చిస్తామని ఆయన వివరించారు.
మహారాష్ట్రలోని అమ్రావతి (Amravati) నగరం చాలా పురాతనమైనది. దీన్ని అంబానగరి అని కూడా పిలిచేవారు. సుప్రసిద్ధ అంబాదేవి ఆలయం అక్కడఉంది. మహారాష్ట్రలోని 8 ముఖ్యమైన మెట్రోపాలిటన్ నగరాల్లో ఇదొకటిగా ఉంది. అమరావతి జిల్లాకేంద్రంగా భాసిల్లుతోంది. మహారాష్ట్రకు ఉత్తరదిక్కుగా ఉంటుందీ నగరం.
ఇక ఆంధ్రప్రదేశ్ లో గుంటూరుజిల్లా అమరావతి పేరిట ఒక గ్రామం చారిత్రిక ప్రాంతంగా ప్రసిద్ధిచెందింది. బౌద్ధావిరామంగా విరాజిల్లింది. కాలక్రమంగా అభివృద్ధికి నోచుకోక ఒక పల్లెగా మిగిలిపోయింది. ఒకటి నగరం, మరొకటి పల్లె అయినప్పటికీ రెంటినీ ఒకే రకంగా ఉచ్ఛరిస్తుంటారు. ఇప్పుడు వీటికి తోడు ఏపీ రజధాని నగరం అమరావతి తోడైంది. ఇటు, రాజధాని అటు మహారాష్ట్రలోని అమ్రావతి రెండూ నగరలై పోవడంతో కాస్తంత తికమక తప్పడంలేదు. మొన్నీమధ్య మోదీ బ్రిటన్ పర్యటనలో ఉన్నప్పుడు ఆదేశం సాయంచేసే అమరావతి ఏదన్నవిషయంపై కన్ఫ్యూజన్ తలెత్తింది. అయితే చివరకు ఏపీ రాజధాని అమరావతి నగరం అభివృద్ధికే సాయంచేయబోతున్నట్లు తేలింది. కానీ ఇంతలో ఇప్పుడు మరో వార్త కన్ఫ్యూజన్ లేవనెత్తింది.
ఇవ్వాళ పత్రికల్లో వచ్చిన వార్త చూస్తుంటే బ్రిటన్ ఆర్థిక సాయం మహారాష్ట్రలోని అమ్రావతికని తేలిపోయింది. మనదేశంలోని మూడు ఆకర్షణీయమైన నగరాల అభివృద్ధికి సాయం చేస్తామంటూ బ్రిటన్ హామీఇస్తూ తేల్చి చెప్పిన నగరాల్లో మహారాష్ట్రలోని అమ్రావతే ఉంది. మరి అలాంటప్పుడు ఏపీ రాజధాని అమరావతి మాటేమిటీ ? లేకపోతే రెండు అమరావతిలకు బ్రిటన్ ప్రభుత్వం సాయం అందిచబోతున్నదా? ఈ విషయంపై స్పష్టత కనిపించడంలేదు.
ఏపీ రాజధాని అమరావతి నగరానికి అనేక దేశాల నుంచి పెట్టుబడులు రావాల్సిఉంది. అలాగే, కొన్నిదేశాలు రాజధాని అభివృద్ధిలో భాగస్వామి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి నగరం పేరు ప్రస్తావించేటప్పుడు
ఏపీ అమరావతి అని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే మీడియాలో వచ్చే వార్తలు గందరగోళం సృష్టిస్తాయి.
– కణ్వస