దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన షీనా బోరా హత్య కేసుపై బాలీవుడ్ సినిమా రాబోతుంది. హత్యకు గురైన షీనా బోరా పాత్రలో అందాల తార రియా సేన్ నటిస్తుంది. అలనాటి అందాల తార మూన్ మూన్ సేన్ చిన్న కూతురైన రియా బాలీవుడ్ హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ ను చవిచూడలేదు. ఇంత కాలానికి చాలెంజింగ్ పాత్ర దొరికిందని చెప్తోంది. ఇంద్రాణి పాత్రలో రీతుపర్ణా సేన్ గుప్తా నటిస్తుందట. అగ్నిదేవ్ చతుర్వేది దర్శకత్వం వహించే ఈ సినిమా షూటింగ్ ఈ నెల 27న మొదలవుతుంది. షీనా హత్యకేసుతో సంబంధం ఉన్న పాత్రలకు నటీనటుల ఎంపిక దాదాపుగా పూర్తయింది.
పీటర్ ముఖర్జీ, కారు డ్రైవర్ పాత్రలకు కూడా నటుల ఎంపిక పూర్తయిందని అగ్నిదేవ్ చెప్పారు. మిగతా పాత్రలకూ చాలా వరకు కాస్టింగ్ పూర్తయిందట. దీనిని ఓ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించబోతున్నారు. షీనా హత్య కేసులో కీలక నిందితులు ఎవరో ఇప్పటికే స్పష్టమైంది. అయితే హత్యకు కచ్చితంగా కారణం ఏమిటనేది మాత్రం ఇంకా పక్కాగా నిర్ధారణ కాలేదు. అన్నీ ఊహాగానాలే వినవస్తున్నాయి.
రియా సేన్ మాత్రం షీనా పాత్రకు పూర్తి న్యాయం చేస్తానని సోషల్ మీడియాలో తన ఉత్సుకుత గురించి పోస్టింగ్స్ చేస్తోంది. అందాల తారగానే ఇంతకాలం ముద్రపడిన తనకు, ఎమోషన్స్ పలికించే పాత్ర దొరికిందని చెప్తోంది. ఒక రకంగా ఆమెకు ఇది సెకండ్ ఇన్నింగ్స్ వంటిదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పాత్రలో ఆమె మంచి మార్కులు సాధిస్తే మరిన్ని అవకాశాలు రావచ్చు.