రివ్యూ: బ్రో

BRO movie review

రేటింగ్‌: 2.5/5

‘అజ్ఞాతవాసి’ తర్వాత మళ్ళీ ఒరిజినల్ కథతో సినిమా చేయలేదు పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రీమేకులే. ఇప్పుడు మరో రిమేక్ ‘బ్రో’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌తేజ్‌ కలసి నటించిన ఈ చిత్రం తమిళంలో సముద్రఖని డైరెక్ట్ చేసిన ‘వినోదయసిత్తం’ రీమేక్‌. తమిళ్ లో మంచి కాన్సెప్ట్ అని పేరు తెచ్చుకుంది. అదే కాన్సెప్ట్ ని నమ్మి మాతృక దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో `బ్రో`పేరుతో రీమేక్ చేశారు. మరి నిర్మాతలు అంత బలంగా నమ్మిన కాన్సెప్ట్ ఏమిటి ? పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి ఆ కాన్సెప్ట్ సరిపోయిందా ? పవన్, సాయి తేజ్ కలసి ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని పంచారు?

మార్కండేయ అలియాస్ మార్క్ ( సాయి ధరమ్ తేజ్) ఓ టెక్స్ టైల్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. మార్క్ చినప్పుడే తండ్రిని పోగొట్టుకుంటాడు. తల్లి, తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళ బాధ్య‌త‌ చిన్నప్పుడే తనపై పడుతుంది. కుటుంబానికి తానే పెద్దదిక్కై నడుపుతుంతాడు. కంపెనీ ప‌నిమీద వైజాగ్ కి వెళ్తాడు. తిరిగి హైదరాబాద్ ప్రయాణం అవుతుండగా ఓ కారు ప్రమాదంలో చనిపోతాడు. మార్క్ ని తీసుకెళ్లేందుకు టైమ్‌ (పవన్ కళ్యాణ్) రూపంలో వస్తుంది. తాను చేయాల్సిన పనులు ఇంకా చాలా వున్నాయని, కుటుంబాన్ని ఒక తీరానికి చేర్చాలని, తనని బతికించమని ప్రాధేయపతాడు మార్క్. మార్క్ ఆవేదనని గుర్తించిన కాలం రూపంలోని పవన్ కళ్యాణ్ 90 రోజులు గడువు ఇస్తాడు. మరి ఇచ్చిన గడువులో మార్క్ ఏం చేశాడు? కుటుంబాన్ని చక్కదిద్దాడా? సమస్యలన్నీ తీర్చాడా ? కాలం ఇచ్చిన రెండో అవకాశం మార్క్ కి ఎలాంటి పాఠాలని నేర్పింది ? ఎలాంటి జీవిత సత్యాలని ఆవిష్కరించింది ? అనేది తక్కిన కథ.

జీవితం ఎవరికీ సెకండ్‌ ఛాన్స్‌ ఇవ్వదు. కానీ ఓ వ్యక్తికి అలాంటి అవ‌కాశం వ‌స్తే ఏం జ‌రిగింద‌న్నది ‘బ్రో`క‌థ‌. సినిమా ఆరంభంలోనే కథలోకి వెళ్ళిపోయాడు దర్శకుడు. మార్క్ పాత్ర, అతని కుటుబం, తన వృత్తి..ఇవన్నీ చకచకగా పరిచయం చేస్తూ కథలోకి తీసుకెళ్ళారు. తొలి పది నిమిషాలకే సినిమాలోని మలుపు కూడా వచ్చేస్తుంది. కాలం రూపంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీతో కథ మరింత జోరందుకుంటుంది. సెకండ్ ఛాన్స్ తో మళ్ళీ జీవితం ద‌క్కించుకొన్న‌ మార్క్ కి ఆఫీసు నుంచి, కుటుంబం నుంచి ఎదురయ్యే సంఘటనలు ఆసక్తికరంగానే డీల్ చేశారు. ఇక కాలం రూపంలో పవన్ కళ్యాణ్ ప్రజన్స్, ఆయన పలికే డైలాగులు, బిట్స్ సాంగ్స్ గా వినిపించిన పవన్ పాత హిట్ సాంగ్స్ తో తొలి సగాన్ని సాఫీగానే నడిపేశారు.

ఐతే సెకండ్ హాఫ్ లో బ్రోకి అసలు సమస్య మొదలౌతుంది. ఈ సినిమా కాన్సెప్ట్ ఫస్ట్ హాఫ్ లోనే ప్రేక్షకుడికి క్లియర్ గా అర్ధమైపోతుంది. ఇలాంటి ఊహాజ‌నిత‌మైన క‌థాంశం వున్నప్పుడు కథనంలో హై మూమెంట్స్ ఉండేలా చూసుకోవాలి. కానీ అలాంటిది జరగలేదు. పవన్ కళ్యాణ్ పాత హిట్స్ సాంగ్స్ ని బ్యాగ్ గ్రౌండ్ లో ప్లే చేయడం ఇందులో హై మూమెంట్ అనుకోవడం తప్పితే కథలో హై మూమెంట్ లేకపోవడం ప్రధాన లోపం. సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు సీరియల్ టైపులో అనిపించే అవకాశం కూడా వుంది. ఐతే మార్క్ కుటుంబంతో వున్న అనుబంధం, ఇక కుటుంబంతో ఉండలేకపోతున్నాననే సమయంలో మార్క్ పాత్రలోని ఎమోషన్ కొంత కనెక్ట్ అవుతుంది. మార్క్ చిన్న‌ప్ప‌టి జీవితాన్ని, అత‌ను ప‌డిన క‌ష్టాల్ని చూపించ‌డం కోసం.. పేప‌ర్లు వేయ‌డం, హోటెల్ లో ప‌నిచేయ‌డం, క‌ప్పులు క‌డ‌గ‌డం ఇలాంటి అరిగిపోయిన సీన్లు వేసి.. స్టీరియో టైపు ఎమోష‌న్ ని పండించాల‌ని చూశారు.

ఇదొక ఫిలసాఫికల్ ఫాంటసీ డ్రామా. ఇంటి పెద్ద‌కెప్పుడూ ఓ డైలామా ఉంటుంది. తాను లేకపోతే కుటుంబం పరిస్థితి ఏమిటి? వీళ్ళంతా ఎలా బతుకుతార‌న్న భ‌యం ఉంటుంది. ఐతే ఎవరున్నా, లేకపోయినా జీవితాలు ముందుకు వెళుతూనే వుంటాయి. ఎవరి కోసం ఎవరూ ఆగిపోరు. కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరి జీవితం వారిది. అందరి జీవితాలు మనమే తీర్చిదిద్దేస్తున్నామనే భ్రమ నుంచి బయటికి రావాలనే కోణం నుంచి దర్శకుడు ఆవిష్కరించే సన్నివేశాలు ఆలోచన రేకెత్తించేలా వుంటాయి. తాను కుటుంబానికి టార్చ్ బ్యారర్ అని ఫీలౌతున్న మార్క్ కి అసలు కుటుంబం తనని టార్చర్ లా ఫీలౌతుందని తెలియజెప్పే సన్నివేశం కళ్ళు తెరిపించేలా వుంటుంది. అలాగే జీవితం చాలా సింపుల్. రేపు గొప్పగా బ్రతకాలని ఈ రోజు తప్పులు చేయకూడదు. ఈ క్షణం రైట్ గా వుంటే ఎప్పుడూ గ్రేట్ వుంటాం అనే సందేశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది బ్రో.

‘వినోదయసిత్తం’ రీమేక్ అన్నప్పుడు అందులో పవన కళ్యాణ్ ఏం చేస్తారనే సందేహం చాలా మందిలో కలిగింది. పవన్ కళ్యాణ్ పై వున్న అభిమానం, ప్రేమ. స్నేహం, ఏదైనా అనుకోనివ్వండి…! త్రివిక్రమ్ ఈ సినిమాని పవన్ సెంట్రిక్ గా మార్చేశారు. పవన్ కళ్యాణ్ పాత్రే బ్రోకి శ్రీరామ రక్షగా మారిపోయింది. అంతలా ఆ పాత్రని డిజైన్ చేశారు. ఫాంటసీ సూపర్ పవర్. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సరిపడింది. పవన్ చిటికే వస్తే సీన్ మారిపోతుంటుంది. అది తెరపై చూస్తున్నపుడు ఎబ్బెట్టుగా అనిపించదు. కారణం పవన్ కళ్యాణ్ కి ఆ పవర్, చరిష్మా వుంది. ఆయన పాత పాటల్లోనే ఆయన కనిపించడం, మ‌ళ్లీ స్టెప్పులు వేయ‌డం ఫ్యాన్స్ కి నచ్చుతుంది. ఐతే కొన్ని చోట్ల ఈ పాత పాట‌ల డోసు మ‌రీ ఎక్కువై.. కథకు అడ్డుతగిలినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా భీమ్లా నాయక్ సాంగ్ ఐతే సింకే కాలేదు. అన్ని పాట‌లూ వాడేశారు.. నా పాట లేక‌పోతే ఎలా? అని త‌మ‌న్ ఫీల్ అయి, ఈ పాట‌ని కావాల‌ని ఇరికించిన‌ట్టు అనిపిస్తుంది. పాట‌లు వ‌స్తున్న‌ప్పుడ‌ల్లా వెండి తెర‌పై సడన్ గా ఓ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఏవీని ప్లే చేస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. పవన్ చెప్పే డైలాగులు హుందా గా ఆలోచన రేకెత్తించేలా రాశారు. ఈ పాత్రని ఆయన చాలా సునాయాసంగా పోషించారు. సాయి తేజ్ కు నటించే అవకాశం వున్న పాత్ర దక్కింది. వ్యక్తిగతంగా కూడా ఈ పాత్ర ఆయనకు కనెక్టింగా వుంటుంది. ఐతే డ్యాన్స్ లో మునపటి గ్రేస్ కనిపించలేదు. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం ఆకట్టుకుంటాడు. కేతిక శర్మతో తనకో ప్రేమకథ వుంటుంది. ఐతే ఈ కథ ఒక సైడ్ ట్రాక్ అనిపిస్తుంది. కేతిక అందంగా వుంది కానీ ఆమెకు కథలో పెద్ద ప్రాధన్యత లేదు. ఇద్దరు చెల్లెళ్ళుడీసెంట్ గా నటించారు. రోహిణి పాత్ర హుందాగా వుంది. తనికెళ్ళ భరణి, వెన్నెల కిశోర్, రాజా, సూర్య శ్రీ‌నివాస్‌… ఇలా మిగతా పాత్రల్నీ పరిదిమెర వుంటాయి . దర్శకుడు సముద్రఖనితో పాటు బ్ర‌హ్మానందం కూడా గెస్ట్ రోల్స్‌ లో కనిపించారు.

టెక్నికల్ గా సినిమా డీసెంట్ గా వుంది. తమన్ పాటల్లో మెరుపులు లేవు గానీ నేపధ్య సంగీతం మాత్రం హెవీగా చేశాడు. ముఖ్యంగా పవన్ ప్రజన్స్ లో వచ్చే సీన్స్ ని నేపధ్య సంగీతం మరింత ఎలివేట్ చేసింది. బ్రో థీమ్ సాంగ్ ని వాడుకోవ‌డం అభిమానులకు న‌చ్చుతుంది. కెమెరాపనితనం బావుంది. కానీ సిజీ సరిగ్గా కుదరలేదు. గ్రీన్ మ్యాట్ లో తీసిన షాట్స్ ఈజీగా అర్ధమైపొతుంటాయి. దర్శకుడు సముద్రఖని తన కాన్సెప్ట్ తో పాటు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని కూడా బ్యాలెన్స్ చేసే బాధ్యత తీసుకున్నారు. దీనికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ తోడైయ్యాయి. తివిక్రమ్ మాటల్లో కొన్ని చమక్కులు కనిపిస్తాయి. చివర్లో భస్మాసురుడు రిఫరెన్స్ తో చెప్పే డైలాగ్స్ లో త్రివిక్రమ్ కనిపిస్తాడు. ‘పుట్టడం మలుపు, పోవడం గెలుపు’’ ఇలాంటి ప్రాస కోసం ప్రాకులాడిన కొన్ని డైలాగులు కూడా అసందర్భంగా వినిపిస్తాయి. పవన్ కళ్యాణ్ కి రాసిన మాటలు మాత్రం ప్రత్యేక శ్రద్దతో రాసినట్లుగా వుంటుంది. చాలా సింపుల్ మాటలతో జీవిత సత్యాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఒక‌ట్రెండు చోట్ల పొలిటిక‌ల్ ట‌చ్ కూడా ఇచ్చారు. జ‌న‌సేన గుర్తు గాజు గ్లాసునీ మెరిపించారు. ఇవ‌న్నీ బోన‌స్సే.

వినోదాయ సిత్త‌మ్ లాంటి కాన్సెప్ట్ క‌థ‌ల్లోకి స్టార్ ని తీసుకుని రావ‌డం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. స్టార్ డ‌మ్ కోసం సీన్లు రాయాలా? లేదంటే కాన్సెప్టుని ముందుకు తీసుకెళ్లాలా? అనే మిమాంశ వ‌స్తుంది. అలాంట‌ప్పుడు త్రివిక్ర‌మ్ ప‌వ‌న్‌పై అభిమానం చూపించాడు. ప‌వ‌న్ కోస‌మే అన్న‌ట్టు కొన్ని సీన్లు రాసుకొన్నాడు. ఆ ప్ర‌యాణంలో కాన్సెప్ట్ ప‌క్క‌దారి ప‌ట్టింది. కాక‌పోతే వ్ర‌తం చెడినా ఫ‌లితం ద‌క్కిన‌ట్టు ఆ సీన్ల‌న్నీ ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు న‌చ్చుతాయి. అదే ఈ సినిమాకి శ్రీ‌రామ‌ర‌క్ష‌.

రేటింగ్‌: 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close