షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఏపీలో పార్టీ పెట్టడం ఖాయమని సంకేతాలు ఇచ్చారు. పార్టీ పెట్టాలని తనపై ఎంతో వత్తిడి వస్తోందని… ఒక వేళ తాను తిరస్కరిస్తే.. వైసీపీ కోసం పని చేసి నిరాదరణకు గురవుతున్న వారందరూ కలిసిపార్టీపెట్టే అవకాశం ఉందన్నారు. తన మాట విని వారు గతంలో వైసీపీకి మద్దతిచ్చారని.. తాను వారి మాట వినాల్సిందేనని బ్రదర్ అనిల్ స్పష్టం చేశారు. విజయవాడలో పెట్టినట్లే విశాఖలో బీసీ, ఎస్సీ, క్రిస్టియన్ సంఘాలతో అనిల్ సమావేశమయ్యారు. ఎవరి సాయం లేకుండా ఎవరూ పదవుల్లోకి రాలేరని.. సీఎం జగన్‌కు చురకలంటించారు.
పాలించమని ప్రజలందరూ ఉద్యోగం ఇచ్చారని.. అది సరిగా చేస్తే బాగుండేదన్నారు. సీఎం జగన్ ను కలిసి రెండున్నరేళ్లయిందని.. తమ కుటుంబంలో చిచ్చు ఏర్పడిందని ఆయన చెప్పకనే చెప్పారు. కొత్తగా పార్టీ పెట్టి బిసి కి సీఎం పదవి ఇవ్వాలని అంటున్నారు వారికి అండగా నిలుస్తానని బ్రదర్ అనిల్ ప్రకటించారు. ఎన్నికల ముందు నన్ను నమ్మి సహాయం చేసి ప్రభుత్వ ఏర్పాటు కృషి చేశారు కాబట్టి… వారు బాధ లో ఉంటే స్పందించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. పార్టీ ఏర్పాటు అనేది ఒక్కరోజులో చేసే పని కాదన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను పార్టీ విషయంపై కలవలేదని.. ఆయనను వేరే పని మీద కలిశానన్నారు.
బ్రదర్ అనిల్ మాటల ప్రకారం.. ఆయన ఏ క్షణంలో అయినా ఏపీలోపార్టీ పెట్టడం ఖాయమని అనుకోవచ్చు. అంతేకాక బీసీ సీఎంనినాదంతో ప్రజల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ పార్టీకి షర్మిల మద్దతు ఉంటుందో లేదో స్పష్టత లేదు. తెలంగాణలో ఆమె పార్టీకి కనీస మాత్రం కూడా ఆదరణ లభించకపోతే..ఆమె కూడాఏపీ రాజకీయాల్లోనే చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయని.. అందుకే బ్రదర్ అనిల్ ఏపీలో పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు.