మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో బ్రదర్ అనిల్ కుమార్ సమావేశమయ్యారు. దాదాపుగా గంట పాటు చర్చలు జరిపారు.తాను ఉండవల్లితో కుటుంబ, రాజకీయ అంశాలను చర్చించానని బ్రదర్ అనిల్ తెలిపారు. మాకు సీక్రెట్స్ ఉంటాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయ అంశాలు కూడా చర్చించానని ప్రత్యేకంగా చెప్పడంతో భేటీ యాధృచ్చికంగా నిర్వహించినది కాదని తేలిపోయింది. వైఎస్ కుటుంబానికి ఉండవల్లి అరుణ్ కుమార్ సన్నిహితులు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన వైఎస్ సంస్మరణ సభకు ఏపీ నుంచి ఎవరూ హాజరు కాలేదు.
కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ హాజరయ్యారు. ఇటీవల సీఎం జగన్ పరిపాలనా తీరుపైనా విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో షర్మిల పార్టీకి అనుకున్న విధంగా మైలేజీ రావడం లేదన్న అభిప్రాయం ఉంది. ఇటీవల ఏపీలో కూడా పార్టీ పెట్టకూడదన్న రూలేమీ లేదు కదా అని వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఆ తర్వాత తన రాజకీయ జీవితం తెలంగాణతోనే ముడిపడి ఉందని ప్రకటించి క్లారిటీ ఇచ్చారు.
ఈ విషయంలో ముందడుగు వేయడానికి ఉండవల్లి సలహాలు తీసుకోవడానికి బ్రదర్ అనిల్ వచ్చి ఉంటారని చెబుతున్నారు. అలాగే వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా జగన్ – షర్మిల మధ్య విభేదాల పరిష్కారం కోసం ఉండవల్లి తన వంతు ప్రయత్నాలు చేయాలని కోరేందుకు కూడా వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఉండవల్లి సలహాలు వరకూ ఇవ్వగలరు కానీ మధ్యవర్తిత్వం లాంటివేమీ చేయరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.