వైఎస్ ఫ్యామిలీలో విభేదాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. తన జీవితం తెలంగాణకే అంకితమని.. అక్కడ రాజకీయ పార్టీ పెట్టుకున్న వైఎస్ జగన్ సోదరి షర్మిల ఇప్పుడు మరో పాచిక విసురుతున్నారు. తన భర్త బ్రదర్ అనిల్ సారధ్యంలో ఏపీ లో కొత్త రాజకీయ పార్టీ పెట్టిస్తున్నారు. కొద్ది రోజులుగా ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్న బ్రదర్ అనిల్.. వైఎస్ కుటుంబంతో ఆత్మీయులైన ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారిని కలుస్తున్నారు.
తాజాగా ఆయన విజయవాడలో వివిధ సంఘాల నాయకులతో సమావేశం అయ్యారు. రెండు గంటల పాటు కొత్త పార్టీ పెట్టే అంశంపై చర్చించారు. వైఎస్ జగన్‌ను వ్యతిరేకించే వర్గాలతో పాటు వైసీపీలో ఆదరణ దక్కని వారు కూడా బ్రదర్ అనిల్‌తో భేటీకి హాజరయ్యారు. జగన్ గెలుపుకు మేము ఎంతో కృషి చేశామని.. 2019 ఎన్నికల సమయంలో కూడా అనిల్ మాతో సమావేశం పెట్టి జగన్ కోసం పని చేయాలన్నారని.. జగన్ సిఎం అయ్యాక రెండేళ్లుగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని వైసీపీ అనుబంధంగా వ్యహరించే బీసీ సంక్షేమ సంఘం నేతలు ప్రకటించారు.
బ్రదర్ అనిల్ తో తాము పడిన బాధలు చెప్పామని.. త్వరలోనే కొత్త పార్టీ కింద పని చేద్దామని చెప్పారన్నారు. కొత్త పార్టీ వివరాలను బ్రదర్ అనిల్ ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది. షర్మిల అనుమతి లేకుండా బ్రదర్ అనిల్ రాజకీయ పార్టీ గురించి ఆలోచన చేసే అవకాశం లేదు. పూర్తి స్థాయిలో షర్మిల ఆలోచనలతోనే ముందు జాగ్రత్తగా బ్రదర్ అనిల్‌తో ఏపీలో పార్టీ పెట్టిస్తున్నట్లుగా భావిస్తున్నారు.