రేవంత్ రెడ్డిని నేను వాడు , వీడు అనే పిలుస్తా. నాకు అహంకారం కాదు. నేను తప్పు చేయలేదు కాబట్టి అలాగే ఉంటానని కేటీఆర్ తనను తాను టీవీ9లో రజనీకాంత్ ఎదుట సమర్థించుకున్నారు. తప్పు చేయకపోతే ముఖ్యమంత్రిని వాడు, వీడు అని పిలిచేస్తారా? అని రజనీకాంత్ అడగలేదు కానీ.. సామాన్య జనానికి మాత్రం డౌట్ వస్తుంది. దానికి రేవంత్ భాషను కారణంగా కేటీఆర్ చూపిస్తూ ఉంటారు. ఈ చర్చ మొదలు పెడితే కేసీఆర్ ఉద్యమం దగ్గరకు పోతుంది. కానీ ఒకరు చేశారని మరొకరు.. తిట్టుకుంటూ పోతే దానికి అంతం ఉండదు. బీఆర్ఎస్ గౌరవంగా ఉండి.. రేవంత్ అగౌరవంగా మాట్లాడుతూ ఉంటే ఎవరికి నష్టం? ప్రజలు ఎవర్ని తప్పు పడతారు?
రేవంత్ భాషను ప్రశ్నించాలంటే ముందు కేటీఆర్ కానీ.. బీఆర్ఎస్ నేతలు కానీ అలాంటి భాషను వాడకూడదు. లేకపోతే ప్రజలు ఇద్దరికీ పెద్ద తేడా ఏముందని అనుకుంటారు?. ఇప్పుడు అదే జరుగుతోంది. కానీ బీఆర్ఎస్ పెద్దలు గుర్తించలేకపోతున్నారు. రేవంత్ ను విమర్శించడానికి సోషల్ మీడియాస్ పూర్తి స్థాయిలో వాడేస్తున్న బీఆర్ఎస్ అది వెగటు పుట్టించే స్థాయికి వెళ్తుందని మాత్రం గుర్తించలేకపోతోంది. ఎయిర్ షోలో ఆయన పెట్టుకున్న కళ్ల జోడు దగ్గర నుంచి ప్రజాపాలన సంబరాల్లో ఏదో పాటలు పాడారన్న వరకూ ప్రతి దానికి రేవంత్ నే విమర్శిస్తున్నారు.
రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గుర్తు చేస్తే… మా గురించే మాట్లాడారు..మేం వదలం ఇంకా ఎక్కువచేస్తాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ.. రేవంత్ రెడ్డి భయపడి ఆ మాటలు మాట్లాడుతున్నారా.. మరో కారణమా అన్నది కూడా ఊహించలేకపోతున్నారు. మొత్తంగా రేవంత్ ను టార్గెట్ చేసేందుకు మీడియా, సోషల్ మీడియాలతో గుడ్డిగా పోరాటం చేసేస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఈ గుడ్డి పోరాటాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చరిత్ర చాలా సార్లు చెప్పింది. మరి బీఆర్ఎస్ నేర్చుకుంటుందా?