ఖమ్మం బహిరంగసభలో చంద్రబాబు పార్టీని వీడిన పాత నేతలందర్నీ కలసి రమ్మన్నారు. తెలంగాణను మళ్లీ కలపడం అనే మాటలు మాట్లాడిన వారిపై సెటైర్లు వేశారు. అధికార పార్టీ బీఆర్ఎస్ ను విమర్శించలేదు. ఇంకా చెప్పాలంటే.. తన తర్వాత సీఎం అయిన వాళ్లను అభివృద్ధి దిశగా తీసుకెళ్లారని అభినందించారు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం చంద్రబాబు రాజకీయాల్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయనకు తెలంగాణలో ఏం పని ప్రశ్నిస్తున్నారు. కవిత సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా తెరపైకి వచ్చి చంద్రబాబుపై ఘాటుగా విరుచుకుపడ్డారు.
చంద్రబాబు తెలంగాణ నుంచి ఏడు మండలాల్ని..సీలేరు విద్యుత్ ప్రాజెక్టును లాక్కున్నారని.. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ విమర్శించారు. తెలంగాణ కేసీఆర్ వల్లే అభివృద్ధి చెందిందన్నారు. చంద్రబాబు వల్ల కాదన్నారు. ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకే చంద్రబాబు ఖమ్మంలో సభ పెట్టారని హరీష్ రావు విమర్శించారు. 2018 లో తెలంగాణ పై మహాకూటమి తో కుట్ర చేశారని.. ఇప్పుడు మరో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఆదరించరని స్పష్టం చేశారు. ఖమ్మంలో కూడా చంద్రబాబు జై తెలంగాణ అనలేదని మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ విశ్లేషించారు. కవిత కూడా చంద్రబాబు ఖమ్మం సభపై స్పందించారు. చుక్కలు ఎన్ని ఉన్న చంద్రుడు ఒక్కడే అన్నట్లు తెలంగాణ లో కేసీఆర్ ఒక్కడే అని కవిత స్పష్టం చేశారు. టిడిపిని తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేశారని.. ఇప్పుడు వచ్చి రాజకీయం చేద్దాం అనుకున్న మళ్లి రిజెక్ట్ చేస్తారన్నారు.
ఇక మాజీ టీడీపీ నేత… పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ఆత్మీయుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న మంత్రి గంగుల కమలాకర్ అయితే మరింత ఘాటుగా విమర్శలు గుప్పించారు. మీ మూలాలు ఎక్కడ? ఏపీ మూలాలున్న మీకు తెలంగాణ గడ్డపై ఏం పని అని అని ప్రశ్నించారు. హైద్రాబాద్ సంపదను, నీళ్లను ఎత్తుకుపోయే కుట్రలో భాగంగానే వస్తున్నరాని విమర్శఇంచారు. బీఆర్ఎస్ తో మేము దేశమంతా పోతుంటే.. తెలంగాణ మీదకే వీళ్లంతా ఎందుకొస్తున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబు బహిరంగసభపై ఇతర పార్టీల నేతలెవరూ స్పందించలేదు. కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రమే సీరియస్ గా తీసుకున్నారు. చంద్రబాబు మళ్లీ తెలంగాణలో రాజకీయాలు చేస్తే తమకే ఎదురు దెబ్బ అని వారు భావిస్తున్నట్లుగా దీని ద్వారా అర్థం చేసుకోవచ్చంటున్నారు.