బీఆర్ఎస్ నేతలకు అహంకారం పెరిగిపోయిందని ఎన్నికల్లో ప్రచారం చేశారని .. కానీ తమది ఆత్మవిశ్వాసమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అహంకారానికి ఆత్మవిశ్వాసానికి తేడా తెలియక తమపై తప్పుడు ప్రచారం చేశారని ఢిల్లీలో మాట్లాడారు. ఇదే సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు వింటే అది ఆత్మవిశ్వాసం ఎందుకు అవుతుంది ప్రజలు పాతాళానికి తొక్కేసినా ఇతరుల్ని కించ పరిచే మాటలు మాట్లాడుతూ.. తామేదో పై నుంచి దిగి వచ్చామన్నట్లుగా చెప్పుకోవడం అహంకారమే అవుతుంది. ఢిల్లీలో కేటీఆర్ మాట్లాడిన మాటల్ని చూస్తే… ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి తేడా కేటీఆర్‌కే తెలియదని అనుకోవచ్చు.
సీఎంను కించ పర్చడం ఆత్మవిశ్వాసమా ?
మూటలతో దొరికిన వాడు సీఎం అయ్యాడు అంటూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ సంబోధించారు. ఆయనపై వ్యక్తిగత కోపం ఉండవచ్చు…కానీ ఆయన ప్రజలు ఎన్నుకున్న సీఎం. ఆయనను అవమానిస్తే ప్రజల్ని అవమానించినట్లే. గతంలో సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ ను తిట్టారని.. అది ప్రజల్ని అవమానించడమేనని కేటీఆర్ ఎన్నో సార్లు గగ్గోలు పెట్టారు. అంతేనా పోలీసుల్ని పంపించి కేసులు పెట్టించి.. అరెస్టులు కూడా చేశారు. మరి ఆ నాడు చెప్పిన నీతులు ఇవాళేమయ్యాయి. రేవంత్ రెడ్డి రేపో మాపో అంత కంటే పెద్ద మూటలతో పట్టుకుని ఆయనను ఎక్కడకు పంపారో అక్కడకు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు. అంతకు ముందే కేటీఆర్ సోదరి కవిత నాలుగు నెలలుగా తీహార్ జైల్లో ఉన్నారు. దీన్ని సమర్థించుకోవడం….. సీఎంను తిట్టడం ఆత్మవిశ్వాసం మాత్రం కాదు.. అది అహంకరామే.
ప్రజాతీర్పును కించపర్చడం.. తక్కువ చేయడం ఆత్మవిశ్వాసమా ?
తా దూర సందు లేదు కానీ మెడకేమో డోలు అన్నట్లుగా కేటీఆర్ వ్యవహారశైలి ఉంది. తెలంగాణలో ఆయన పార్టీ ఎందుకు ఓడిపోయిందో.. ఎందుకు డిపాజిట్లు కోల్పోయిందో ఎనాలసిస్ చేసుకోకుండా.. ఏపీలో జగన్ ఓడిపోవడం ఆశ్చర్యకరమని వాదించారు. ఇదే కేటీఆర్ ఏపీ గురించి ఎన్నెన్ని జోకులు వేశారో అందరికీ గుర్తు లేదా. ఏపీలో జీవించడాన్ని నరకంగా చెప్పారు. ప్రజలు అదే అనుభవించారు కాబట్టి తీర్పు ఇచ్చారు. ఇదంతా తెలిసి కూడా జగన్ ఓడిపోవడం ఆశ్చర్యకరమని పనికి మాలిన విశ్లేషణ చేయడం అహంకారమే. ప్రజా తీర్పును కించపర్చడం అహంకారమే. ముందుగా తమ దుస్థితి ఎందుకు ఇంత ఘోరంగా అయిందో గుర్తించకపోవడం.. తమ పార్టీ పేరు మార్పు వల్ల ఓడిపోయామనడానికి ఆధారాల్లేవని చెప్పుకోవడం తప్పును ఒప్పుకోకపోవడమే.. అది ఆత్మవిశ్వాసం కాదు.. అహంకారమే.
ఆత్మవిశ్వాసం ధైర్యంగా పోరాడుతుంది.. అహంకారం తల వంచుతుంది !
కేటీఆర్‌ది ఆత్మ విశ్వాసమే అయితే ఆయన తెలంగాణలో పోరాడాలి. కానీ వారం రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేసి బీజేపీ పెద్దల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు. తాము గతంలో చేసిన ఫిరాయింపుల రాజకీయాలపై ప్రశ్నిస్తే ఎందుకు ఎదురుదాడి చేస్తున్నారు. పోయేవాళ్లు పోనివ్వండి..అని వదిలేయవచ్చు కదా. తాము చేసిందే కాబట్టి అలా వదిలేయడమే.. ఆత్మవిశ్వాసం.. రోడ్డున పడి గందరగోళం చేయడం కాదు. కవితను జైలు నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు లోక్ సభ ఎన్నికల్లో పార్టీని పణంగా పెట్టుకోవడం ఆత్మవిశ్వాసం ఎలా అవుతుంది. కేటీఆర్ ఇప్పటికైనా ఆత్మవిశ్వాసానికి.. అహంకారానికి తేడా తెలుసుకుంటే.. మళ్లీ ట్రాక్ లో కి రావొచ్చు.. లేకపోతే కష్టమే.