బీఆర్ఎస్ నేతలంతా ఇప్పుడు తాము పార్టీ మారడం లేదని చెప్పుకోవాల్సి వస్తోంది. సైలెంట్ గా ఉంటే పార్టీ మారిపోతున్నారని సోషల్ మీడియాలో వచ్చేస్తోంది. తాజాగా తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించుకున్నారు. ఎందుకంటే ఆమె కేసీఆర్ నిర్వహించిన సమావేశాలకు వెళ్లలేదు. అందుకే పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని పుకారు ప్రారంభమయింది.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను ఖాళీ చేసే పనిలో ఉన్నారు. అందుకే అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా బీఆర్ఎస్ నేతల్ని చేర్చుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ జాబితాలో సబితా కూడా ఉండే ఉంటారు. ఎందుకంటే ఆమె నిఖార్సైన కాంగ్రెస్ నేత. కేసీఆర్ మంత్రి పదవి ఆఫర్ చేయడంతో బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి. చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కాస్త ఇబ్బంది పడ్డారు. కానీ ఆయన కాంగ్రెస్ లో చేరాక… బీఆర్ఎస్ లో రంగారెడ్డి జిల్లాలో వారే కీలకం.
అయితే బీఆర్ఎస్ పరిస్థితి రాను రాను తీసికట్టుగా మారుతూండటంతో వారిలోనూ ఆందోళన ప్రారంభమయిందని చెబుతున్నారు. అందుకే పాత కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్తున్నారన్న పుకార్లు ప్రారంభమయ్యాయి. ఒక్క సబితా ఇంద్రా రెడ్డి మాత్రమే కాదు.. దాదాపుగా అందరు నేతల మీద చివరికి హరీష్ రావు మీద కూడా పుకార్లు ప్రారంభమయ్యాయి. అంతా ఇప్పుడు అదేం లేదని పదే పదే చెప్పుకోవాల్సి వస్తోంది.